టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై చెప్పులతో దాడి చేసిన ప్రయాణికులు, కండక్టర్
Publish Date:May 1, 2026
Advertisement
లంచం అడిగాడని బస్సులోనే రభస.. చెకింగ్ అధికారిని చెప్పులతో కొట్టిన వైనం.. నారాయణఖేడ్ బస్సులో హైడ్రామా.. సంగారెడ్డి జిల్లాలో టీజీఆర్టీసీ అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విధుల్లో భాగంగా టికెట్లు తనిఖీ చేస్తున్న ఇన్ స్పెక్టర్ పై కండక్టరే ప్రయాణికులతో కలిసి దాడికి దిగడం కలకలం రేపింది. రాయికోడ్ సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద టికెట్ తనిఖీ అధికారులు ఆపారు. బస్సులో ఉన్న ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా, ఒక వ్యక్తి వద్ద టికెట్ లేదని తేలింది. ఈ విషయంలో ఇన్‌స్పెక్టర్ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. అయితే, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సదరు అధికారి భారీగా లంచం డిమాండ్ చేశాడని కండక్టర్ ఆరోపించారు. రూ. 20 వేలు ఇస్తేనే వదిలేస్తానని ఇన్‌స్పెక్టర్ బెదిరించాడని చెప్తూ, కండక్టర్ తో పాటు కొందరు ప్రయాణికులు ఒక్కసారిగా అధికారిపై తిరగబడ్డారు. బస్సును ఎక్కువ సమయం నిలిపివేయడంతో విసిగిపోయిన ప్యాసింజర్లు.. ఇన్‌స్పెక్టర్‌ను చెప్పులతో కొట్టే ప్రయత్నం చేశారు. "నీకు నచ్చింది చేసుకో.. ఏం చేసుకుంటావో చూస్తాం" అంటూ పబ్లిక్‌లోనే వార్నింగ్ ఇవ్వడం అక్కడ ఉన్న వారందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ వ్యవహారంపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అసలు గొడవకు కారణం లంచం అడగడమా? లేక టికెట్ లేని విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాడి చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. సాధారణంగా ప్రయాణికులు, సిబ్బంది మధ్య గొడవలు చూస్తుంటాం కానీ, ఒకే శాఖకు చెందిన అధికారుల మధ్య ఇలాంటి భౌతిక దాడులు జరగడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన ఆర్టీసీలో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇన్‌స్పెక్టర్ లంచం అడిగింది నిజమైతే ఆయనపై, అలాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై వేర్వేరుగా విచారణ జరిపే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/tgsrtc-news-36-218714.html





