ఉగ్రవాదులకు సేఫ్ జోన్‌గా తెలుగు రాష్ట్రాలు..
Publish Date:Jul 18, 2016
Advertisement
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై ఉగ్రవాదం బుసకొడుతోంది. ఈ భయం భారతదేశాన్ని ఎప్పటి నుంచో వెంటాడుతోంది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉంది. నిఘా వర్గాలు ఎంతగా పహారా కాస్తున్నప్పటికి ఉగ్రవాదులు ఎప్పుడు, ఎక్కడ విరుచుకుపడతారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం పేరు చెబితేనే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఉగ్రవాదం "ఇస్లామిక్ స్టేట్" ప్రభావంతో జిల్లాలకు విస్తరించింది. ఇటీవల హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపేందుకు ఐసిస్ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. ఉగ్రవాదానికి..భాగ్యనగరానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకు ముందు దేశంలో జరిగిన చాలా పేలుళ్ల మూలాలు హైదరాబాద్‌లోనే దొరికాయి. చాలా ఉగ్రవాద సంస్థలకు హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ క్యాంపస్‌లా మారిపోయింది. రీసెంట్‌గా ఉగ్రవాదాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న ఐఎస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై గట్టిగానే పడింది. అందుకే రాజధానిని దాటి జిల్లాల్లో ఉగ్రజాడలు వెలుగు చూస్తున్నాయి. సిరియా వెళ్లేందుకు ప్రయత్నించిన నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను పుణేలో అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఒక యువకుడు ఇప్పటికే సిరియాలో జరుగుతున్న యుద్ధంలో మరణించాడు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ ఐసిస్ కదలికలు ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్రంగా మారుతున్న గుంటూరు జిల్లాలో ఉగ్రవాదుల జాడలు బయటపడటం అప్పట్లో కలకలం రేగింది. జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఐఎస్‌లో పనిచేస్తున్నారు. వారు ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన తల్మిజూర్ రెహమన్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడి నుంచి సిరియా చేరుకుని అక్కడ యుద్ధంలో మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెహమాన్ మరణించలేదని తేలింది. అలాగే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల్లో కొందరు ఆయుధాల కోసం అనంతపురంలో బస చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇలా నిజామాబాద్ నుంచి అనంతపురం వరకు ప్రతి ప్రాంతం ఉగ్రవాదులకు సేఫ్‌జోన్‌గా మారడంతో ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. అయితే అదృష్టవశాత్తూ చాలా కుట్రలను నిఘా వర్గాలు విజయవంతంగా ఛేదించగలిగాయి. కానీ తెలియకుండా ఇంకా అనేకం జరుగుతూ ఉండవచ్చని..వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/terrorist-attacks-45-63942.html





