సిడ్నీలో ఉగ్రఘాతుకం.. నిందితులు పాక్ కు చెందిన తండ్రీకొడుకులు
Publish Date:Dec 15, 2025
Advertisement
అస్ట్రేలియా సిడ్నీలోని బోండీబీచ్ లో జరిగిన నరమేథం ఉగ్రదాడేనని తేలింది. ఐసీస్ తో సంబంధాలున్న పాక్ జాతీయులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. యూదులు లక్ష్యం వారు హనూకా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పాకిస్థాన్ జాతీయులైన తండ్రీ కొడుకులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తేలింది. కాల్పులకు తెగబడ్డవారిని నవీద్ అక్రమ్, అతడి తండ్రి సాజిద్ అక్రమ్ గా రక్షణ బలగాలు గుర్తించాయి. వీరిరువురూ పాక్ నుంచి వచ్చిన వారేనని వెల్లడించాయి. భద్రతాదళాల కాల్పుల్లో నవీద్ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఓ హంటింగ్ క్లబ్‌లో సభ్యుడైన అతడి తండ్రి సాజిద్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. సాజిద్ పేరిట 2015 నుంచి గన్ లైసెన్స్ ఉందని తేలింది. సాజిద్ వద్ద ఉన్న ఆరు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తండ్రీకొడుకులు జరిపిన దాడిలో16 మంది మరణించగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. ఇక పోతే కాల్పులకు తెగబడిన నిందితులు ఇద్దరూ చాలా ఏళ్లుగా సిడ్నీలో నివాసం ఉంటున్నా వారి మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. విచారణలో భాగంగా పోలీసులు ఆదివారం డిసెంబర్ 14) రాత్రి వారి నివాసాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా నవీద్ అక్రమ్ లైసెన్స్ పొందిన ఆయుధాలను విక్రయిస్తుంటాడని తేలింది.
ఇలా ఉండగా నిందితుల్లో ఒకరు చాలా కాలంగా ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘాలో ఉన్నట్లు చెబుతున్నారు. కాల్పుల ఘటన తరువాత జరిపిన సోదాలలో వీరి కారులో ఐసీస్ నల్లజెండాలు లభ్యమయ్యాయి. కాగా వీరిని ఓ సామాన్యుడు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. ఆ క్రమంలో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలకు తెగించి నిందితులను అడ్డుకున్న వ్యక్తిని 43 ఏళ్ల అహ్మద్ గా గుర్తించారు, ప్రాణాలకు తెగించి మరీ నిందితుడితో పోరాడిన అహ్మద్ రియల్ హీరోగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/terrorist-attack-in-sydney-36-211003.html





