తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు.. బ్యాలెట్ పత్రాలకు చెదలు
Publish Date:Jun 4, 2019
Advertisement
తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిమిత్తం బ్యాలెట్ పెట్టెలను తెరచిన అధికారులు అవాక్కయ్యారు. బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టింది. గత నెలలో 5,659 ఎంపీటీసీలు, 534 జడ్పీటీసీ స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. పోలింగ్ తేదీకి ఓట్ల లెక్కింపునకు మధ్య ఈసారి చాలా రోజుల సమయం పట్టింది. దీంతో బ్యాలెట్ పత్రాలు ఎక్కువ రోజులు స్ట్రాంగ్ రూమ్‌ల్లోనే ఉంచాల్సి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని.. అంబటిపల్లి, సూరారం ఎంపీటీసీ స్థానాల్లో, మహాదేవ్‌పూర్ జడ్పీటీసీ పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పెట్టెలకు చెదలు పట్టింది. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అంబటిపల్లి, సూరారం ఎంపీటీసీ స్థానాల్లో, మహాదేవ్‌పూర్ జడ్పీటీసీ స్థానంలో ఫలితాలను నిలిపివేయనున్నట్లు సమాచారం. ఇదిలావుండగా, ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం, పలు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని చూపుతున్నారు. కొన్ని చోట్ల కరెంటు సరఫరా లేక కౌంటింగ్ నిలిచింది. అత్యధిక కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రానికి తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/termites-damaged-ballot-papers-in-telangana-39-87212.html





