వివేక హత్య కేసులో అసలు నిజం ఇదే?
Publish Date:Mar 21, 2026
Advertisement
తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ తాజా సంచికలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఉత్కంఠభరిత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో జరిగిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని పలు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయానికి వస్తే, వైఎస్ సునీతకు న్యాయం జరగలేదని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సీబీఐ వ్యవహార శైలి పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ, భారత చరిత్రలోనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడంలో సీబీఐ వెనుకడుగు వేసిందా? అని రవిశంకర్ ప్రశ్నించారు. ఈ హత్య కేసు ఆధారంగా సినిమా తీస్తే అది ‘బాహుబలి’కంటే పెద్ద హిట్ అవుతుందేమోనని రవిశంకర్ వ్యాఖ్యానించగా, దానికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్—ఇది రాజమౌళి కాదు, రామ్ గోపాల్ వర్మ తీసే కథ అని వ్యాఖ్యానించారు. “హూ కిల్డ్ బాబాయ్?” అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదని, చివరికి కేసు మూసివేసే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. జగన్ మీడియా, ఎంపీ అవినాశ్ రెడ్డి, వివేక వివాహేతర సంబంధాల కోణంలో హత్యను మళ్లించే ప్రయత్నం చేసిందని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఈ కేసును సీఎం చంద్రబాబు సక్రమంగా హ్యాండిల్ చేయలేదని, తనపైకి వస్తుందనే భయంతో వెనుకడుగు వేశారని కూడా విమర్శించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లరావు వద్ద కీలక ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని, అప్పటి కడప ఎస్పీ నిజాయితీగా విచారణ చేస్తుండగా ఆయనను బదిలీ చేశారని తెలిపారు. ఇక రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ—తమిళనాడులో ఎవరైనా అధికారంలో ఉన్నా కేంద్ర నిధుల కోసం ఐక్యంగా పోరాడతారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే, జగన్ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే స్వార్థంతోనే జగన్ వ్యవహరిస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. మరోవైపు, వచ్చే రెండున్నర సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తికాకపోతే చంద్రబాబు చరిత్రలో నిలబడలేరని హెచ్చరించారు. అమరావతి నిర్మాణం జరగకపోతే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని కూడా తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మంత్రి పీ. నారాయణ విఫలమయ్యారని విమర్శించిన డోలేంద్ర ప్రసాద్, ఇప్పటికైనా తన సూచనలు తీసుకుని వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇదే విషయాన్ని రవిశంకర్ కూడా ప్రస్తావిస్తూ—రైతులకు న్యాయం చేయాలంటే అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు.ఇలాంటి పలు ఆసక్తికర రాజకీయ అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చు.
http://www.teluguone.com/news/content/teluguone-vastava-vedika-25-215915.html




