తెలుగు తమ్ముళ్ల సంబరాలు.. ఎందుకో తెలుసా?
Publish Date:Oct 6, 2025
Advertisement
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల సంబరాలు జరుపుకుంన్నారు. ఇంతకీ సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నకిలీ మద్యం వ్యవహారంలో తంబళ్లపల్లి తెలుగుదేశం ఇన్చార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డిని పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయడమే ఈ సంబరాలకు కారణం. జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసినందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ బి.కొత్తకోట జ్యోతి చౌక్ లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి మరీ సంబరాలు జరుపుకున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని చాటిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని వారు స్వాగతిస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చిన జయచంద్రారెడ్డి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో ఉంటూ.. క్రమశిక్షణను ఉల్లంఘించి, జయచంద్రారెడ్డి నకిలీ మద్యం వ్యవహారంలో మునిగి తేలుతున్నారని కార్యకర్తలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. జయచంద్ర రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటూనే వైసీపీ కోవర్టుగా మారారని తెలుగుదేశం శ్రేణులు గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పలు ఆందోళనా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబుకు , మంత్రి లోకేష్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా ఆయనపై నకిలీ మద్యం కేసు నమోదు కావడంతో పార్టీ హైకమాండ్ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసింది. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/telugudesham-celebrates-jayachandra-reddy-suspenssion-from-party-39-207410.html





