'కారు'కి సైకిల్ పంచ్
Publish Date:May 2, 2013
Advertisement
టీఆర్ఎస్ 'ఆకర్ష్' మంత్రతో టిడిపి పార్టీని ఖాళీ చేసేస్తామని కేసీఆర్ ప్రకటించగా.. దానికి భిన్నంగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు 'కారు' దిగి 'సైకిల్'ఎక్కడానికి ఇష్టపడడంతో ఆయనకి రివర్స్ పంచ్ పడినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దొమ్మాటి సాంబయ్య, మేకల సారంగపాణి మూడు రోజుల క్రితం చంద్రబాబుని కలిసినట్లు సమాచారం. అనుచరులతో కలిసి టీడీపీతీర్థం పుచ్చుకుంటామని వారు కోరాగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీకి, పదవికి దొమ్మాటి సాంబయ్య బుధవారం రాజీనామా చేశారు. ఆ తరువాత కొన్ని గంటలకే చాడ సురేష్ రెడ్డి, మేకల సారంగపాణిలపై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారని, కేసీఆర్ కుటుంబం ఒంటెద్దు పోకడల మూలంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, డబ్బున్న వారికే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎంపీ ఛాడా సురేష్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఈ విధంగానే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 100 సీట్లు కాదు కదా కనీసం పది సీట్లు కూడా రావని అన్నారు. గతంలో రెండు సార్లు టీడీపీ నుండి ఎంపీగా గెలిచిన సురేష్ రెడ్డి ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. అయితే చాడ, సాంబయ్యలు ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ కు చెందిన బలమైన నాయకులు కావడంతో జిల్లా రాజీకీయాలపైనే కాకుండా పార్టీపైనా తీవ్రప్రభావం చూపుతుందని పార్టీ వర్గాలు మదనపడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/telugudesam-chandrababu-39-22828.html





