గ్లోబంత సంబురం.. పెట్టుబడుల స్వర్గధామం
Publish Date:Dec 10, 2025
Advertisement
రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్- గ్లోబల్ సమ్మిట్ లో 5. 75 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పలువురు వ్యాపార, రాజకీయ, సినీ, కార్పొరేట్, ఆర్ధిక రంగ అతిరథ మహారథులు ఏతెంచగా.. అంగరంగ వైభవంగా నభూతో .. అన్న స్థాయిలో జరిగిందీ గ్లోబల్ సంబురం. ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండో విజయవంతమైన ఏడాది ముగింపు ఉత్సవంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణను ప్రపంచ రోల్ మోడల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది రాజకీయాలకు అతీతంగా కేవలం అభివృద్ధీకి మాత్రమే పెద్ద పీట వేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ అంతా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వైపు చూసింది. అధికారిక కార్యక్రమాల్లోనూ రాజకీయ ఆరోపణలు వినీవినీ విసిగి వేసారిన జనాన్ని ఫక్తు ప్రొఫెషనల్ గా సాగిన ఈ సమ్మిట్ విపరీతంగా ఆకర్షించింది. రాజకీయాలకు అతీతంగా సినీ, క్రీడా, వ్యాపార, ఆర్ధిక రంగ ప్రముఖులతో కూడిన మేథో మథనం జరగడంతో తెలంగాణ భవిష్యత్ బంగారమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ప్రపంచంలోనే భారత్ యువరక్తంతో కూడున్న దేశమైతే.. అందులో తెలంగాణ మరింత యువ రాష్ట్రమంటూ శంతను నారాయణ్ వంటి ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు పేర్కొన్నారు. ఇక 2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యం అతిశయం ఏమీ కాదనీ, ఈ విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలతో పోటీ పడ్డం చాలా గొప్ప విషయమనీ ప్రముఖ ఆర్ధిక వేత్త అర్వింద్ సుబ్రహ్మణియన్ అన్నారు. కేవలం రాష్ట్రాలే కాదు నగరాల మధ్య కూడా పోటీ ఉండాలనీ, ప్రస్తుతం దక్షిణాదిలో బెంగళూరు అర్బన్ సమస్యలతో సతమతమవుతుంటే, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వంటి విస్తరణ కార్యక్రమాల ద్వారా ప్రపంచ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోందన్నారాయన. తెలంగాణ గొప్పగా ట్రాన్స్ ఫార్మింగ్ జరుగుతోందనీ, ఇటీవలి కాలంలో విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోందన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఇక మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి మూడంచల వ్యూహం అనుసరిస్తున్నట్టు తన విజన్ డాక్యుమెంట్ లో ఆవిష్కరించింది రేవంత్ సర్కార్. అందులో భాగంగా భావితరాల కోసం తెలంగాణను తీర్చిదిద్దడంతో పాటు, ఆర్ధిక సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర వారసత్వ, సాంస్కృతిక కళా వైభవాలకు పెద్ద పీట వేసేలా ప్రణాళికలు రచించారు. 5 వేల కోట్లతో సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో తాము పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు యూపీసీ సీఈవో అలోక్ కుమార్. 1100 కోట్లతో వింటేజ్ కాఫీ ప్లాంట్ తెలంగాణలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారుఆ సంస్థ ఎండీ బాలకృఫ్ణన్. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర అయితే స్కిల్ డెవలప్మెంట్ కాలేజీకి తనను బాధ్యత వహించమని కోరడంతో కాదనలేక పోయానని, అందుకు కారణం సీఎం రేవంత్ విజన్, సునిశిత ఆలోచనా సరళి, ఆపై పేదరిక నిర్మూలనపై ఆయనకున్న నిబద్ధత అంటూ పొగడ్తలు గుప్పించారు. తెలంగాణ నిజంగానే ఒక రోల్ మోడల్ అన్నారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్. మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధ్యమేనని ప్రపంచమంతా చెప్పిందని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు. ఈ ఫ్యూచర్ సిటీ కోసం 2027 వరకూ ఎదురు చూడక్కర్లేదు.. అంతకన్నా ముందే సాకారమవుతుందన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఇక ఇదే ఫ్యూచర్ సిటీ ద్వారా ఏకంగా 13 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నట్టు తెలుస్తోంది. 13, 500 ఎకరాల్లో నిర్మితమయ్యే ఈ నగరం ఒక ఆర్కిటెక్ అద్బుతం కానుందని, ఏకంగా 9 లక్షల మందికి ఆవాస యోగ్యం కానుందని ప్రకటించారు సమ్మిట్ నిర్వాహకులు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పూర్తైతే.. ప్రపంచమే హైదరాబాద్ కి తరలి వస్తుందని అన్నారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్ర సింగ్. పర్యాటకంగా మాత్రమే కాకుండా సినిమా పరంగా కూడా తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతలను తీసుకుంటున్నట్టు ఈ సదస్సు ద్వారా ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం తెలుగు వారికి ఉన్న స్టూడియోలే కాక సల్మాన్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ తారలు సైతం ఇక్కడ స్టూడియోలు పెట్టడానికి ముందుకొచ్చారు. భారతదేశంలోనే సమ వాతావరణ పరిస్థితులు ఉన్న హైదరాబాద్ దేశంలోని అన్ని సినిమా రంగాల వారికి భూతల స్వర్గంతో సమానం కావడంతో అందరినీ ఇక్కడికి ఆకర్షించి వరల్డ్ మూవీ హబ్ గానూ తీర్చిదిద్దేందుకు తమ వంతు యత్నం చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఐటీ విప్లవానికి తెలంగాణ పుట్టినిల్లు లాంటిదని, స్టార్టప్ హబ్ గానూ హైదరాబాద్ కు ఎన్నో పేరు ప్రఖ్యాతలున్నాయనీ ప్రశంసించారు పలువురు ఆర్ధిక నిపుణులు. ఇక దువ్వూరి అయితే తెలంగాణ అన్ బీటబుల్ గ్రోత్ సాధిస్తోంన్నారు. ఏటా 6-9 శాతం స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తోందని గుర్తు చేశారు. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండో ఏడాది దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేలా ఎంఓయూలు జరగడం ఏమంత సాధారణ విషయం కాదు. అయితే ఈ ఎంఓయూలను పెట్టుబడులుగా మలచడంలో ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకోవల్సిన అవసరముంది. ఆ మాటకొస్తే ఐటీ పరిశ్రమల శాఖను నిర్వహిస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇందుకోసం ప్రత్యేక రూట్ మ్యాప్ ని తయారు చేయాల్సి ఉంది. ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆయా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన రాయితీలు, ఇతరత్రా సౌలభ్యాలను వారికి అందేలా సింగిల్ విండో ఏర్పాటు చేయాల్సి ఉంది. వచ్చాం- ఒప్పందాలు చేసేశాం- వెళ్లామని కాకుండా ఎప్పటికప్పుడు ఫాలో అప్ లతో ఈ పెట్టుబడులను తెలంగాణలో గ్రౌండ్ అయ్యేలా చేడాల్సి ఉంది. అలా జరిగితే.. ఫ్యూచర్ సిటీ ద్వారా 13 లక్షలేం ఖర్మ అంతకన్నా మించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణను వెతుక్కుంటూ రావడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. ఎనీ హౌ ఆల్ ద బెస్ట్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్. ఇలాగే మరిన్ని వసంతాలు మరిన్ని సదస్సుల నిర్వహణతో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఎదగాలని.. కోరుకుందాం. సీఎం రేవంత్ కలలు గన్నట్లుగా దావోస్ తరహాలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే వేదికగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోవాలని ఆశిద్దాం. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెళ్ల సైతం హైదరాబాద్ కేంద్రంగా ఏఐ ఇన్వెస్ట్ మెంట్ చేస్తామన్నారు. సుమారు లక్షన్నర కోట్ల పెట్టబడులు భారత్ లో పెట్టనుండగా వీటిలో అత్యధిక శాతం హైదరాబాద్ లోనే అని సంకేతాలిచ్చారు.
http://www.teluguone.com/news/content/telangana-raising-global-summit-paradise-for-investments-45-210802.html




