ఏపీ సీఎం చుట్టూ తెలంగాణ రాజకీయం
Publish Date:Jul 8, 2025
Advertisement
తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెంట్రిక్‌గా సాగుతున్నట్లే కన్పిస్తోంది. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వివిధ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను నిశితంగా గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ప్రధానంగా బనకచర్ల అంశంలో ఏపీ ప్రభుత్వం తీరుపై తెలంగాణ సర్కారు భగ్గుమంటోంది. ఓవైపు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం చెబుతున్న ఏపీ సర్కారు.. వరద జలాలతో సముద్రంలోకి వృథాగా పోయే నీటితో బనకచర్ల కట్టుకుంటామని చెప్పడం సరికాదని వాదిస్తోంది. కేంద్రంలో పలుకుబడి ఉందని.. బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ దెప్పిపొడుస్తున్నారు. కేంద్ర అండతో ముందుకు పోదామని అనుకుంటే తమ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ వద్ద అవసరమైన ప్రణాళిక, వ్యూహం ఉన్నాయంటున్నారు. అదలా ఉంటే సముద్రంలో వృధాగా కలిసే జలాలు వినియోగంలోకి తేవడానికి ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విమర్శల పాలవుతోంది. ఇక.. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబు.. బనకచర్ల విషయంలో చేస్తున్న కామెంట్లు సరైనవి కావంటున్నారు మాజీ మంత్రి హరీశ్‌రావు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ..ఏపీ సీఎం డజన్ల కొద్దీ లేఖలు కేంద్రానికి రాసిన విషయాన్ని గుర్తు చేశారాయన. బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతోందని విమర్శించారాయన. ప్రజాభవన్‌లోనే సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. బనకచర్ల విషయంలో బీజేపీ వాదన మరోలా ఉంది. మోడీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనంటూ చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతోపాటు, కేంద్ర ప్రభుత్వ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేశారని.. అన్ని అనుమతులు పొందాకే ప్రాజెక్టు ముందుకు సాగుతుందన్నారు. ఒక్క బనకచర్ల అంశమనే కాదు.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపైనా సీఎం చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాలు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారని ఆరోపిస్తున్నారు. ఈటల రాజేందర్, డీకే అరుణలాంటి వాళ్లు ఉండగా.. తనకు అనుకూలమైన రామచంద్రరావుకు చంద్రబాబు ఆ పదవి ఇప్పించుకున్నారని ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్. ఇలా దాదాపుగా తెలంగాణలోని అన్ని పార్టీలూ చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు చేయడం వెనుక కారణం ఏంటన్న దానిపై పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద చర్చే సాగుతోంది.త్వరలోనే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండటం, తెలంగాణలోనూ టీడీపీ అధినేత పార్టీని యాక్టివ్ చేస్తుండటంతో తెలంగాణ పార్టీలు చంద్రబాబు సెంట్రిక్‌గా రాజకీయం మొదలుపెట్టాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అయితే.. తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో ఆచి తూచి స్పందిస్తున్నారు. అసలు తమ పార్టీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం, ప్రభావం ఎందుకు ఉంటుందని కమలం ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి అధ్యక్షుడిని నియమించాలంటే చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం అధిష్టానానికి లేదని మరికొందరు కాషాయ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అలాంటి వాళ్లకు నల్లా, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలని ధ్వజమెత్తారు.
http://www.teluguone.com/news/content/telangana-politics-around-cbn-39-201525.html





