మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
Publish Date:Feb 13, 2026
Advertisement
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. నల్గొండ జిల్లాలో మున్సిపల్ పీఠాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు హస్తం పార్టీ గెలుచుకుంది. అటు సూర్యాపేట జిల్లాలోని హుజుర్నగర్, కోదాడ, నేరేడుచర్లలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తిరుమలగిరిలో బీఆర్ఎస్ గెలిచింది. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 60 డివిజన్లలో 45 స్ధానాలను సొంత చేసుకుంది. బీఆర్ఎస్ 5 బీజేపీ ఒక డివిజన్లో గెలుపుపొందాయి. మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకీ షాక్ తగిలింది. 60 డివిజన్లలో సీపీఐ 23 డివిజన్ల కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ 19 డివిజన్ల గెలిచింది. బీఆర్ఎస్ 9, సిపిఎం 1, బీజేపీ1 ఇండిపెండెంట్ లు 05 విజయం సాధించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ సీపీఐ, బీఆర్ఎస్ పంచుకొనున్నారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి ఏర్పడింది. మొత్తం 12 వార్డుల ఫలితాలు ప్రకటించగా ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. బీజేపీ 5 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తలా 3 స్థానాలు సాధించగా, ఒక స్వతంత్ర అభ్యర్థి (కాంగ్రెస్ రెబెల్) విజయం సాధించారు. దీంతో పాలక మండలి ఏర్పాటు కోసం రాజకీయ సమీకరణాలు కీలకంగా మారాయి. స్వతంత్ర సభ్యుడి మద్దతు ఎవరికివస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక యాద్రాది భువనగిరి జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మోత్కూరు మున్సిపాలిటీలో మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ 8 స్థానాలు దక్కించుకుని మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ 3, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో మోత్కూరులో కాంగ్రెస్ పాలక బాధ్యతలు చేపట్టనుంది.అదే జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ విజయపతాకం ఎగురవేసింది. మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 2, బీఆర్ఎస్ 1, సీపీఐ 1 స్థానం దక్కించుకున్నాయి. పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 23 స్థానాల్లో కాంగ్రెస్ 15 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. బీఆర్ఎస్ 6 స్థానాలకు పరిమితమైంది. సత్తుపల్లిలో కాంగ్రెస్ పాలన ఖాయం అయింది.
http://www.teluguone.com/news/content/telangana-municipal-election-25-214027.html





