ఎన్‌కౌంటర్లు ...అరెస్టులు ...లొంగుబాట్లు మావోల ఉనికి ప్రశ్నార్ధకం!
Publish Date:Feb 22, 2026
Advertisement
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది. ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ. డిసెంబర్ 2025 నుంచి జరుగుతున్న లొంగుబాటు చర్చలు చివరకు కొలిక్కి వచ్చి సరెండర్ అయ్యారు. గత ఏడాది కాలంలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు వంటి కీలక నేతలను భద్రతా బలగాలు హతమార్చాయి. మల్లోజుల, దేవా లాంటి కీలక నేతలు లొంగిపోయారు. సో ఇలా మావోయిస్టు పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ దాదాపుగా తుడిచి పెట్టుకుపోయింది. ఆపరేషన్ కగార్ తో గత ఏడాదిలోనే సుమారు 390 మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి. అబూజ్‌మడ్, కర్రెగుట్టలు వంటి పటిష్టమైన మావో స్థావరాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంపై మావోయిస్టు పార్టీలో తీవ్ర చీలికలు వచ్చాయి. మల్లోజుల వేణుగోపాల్ రావు లాంటి వారు సాయుధ పోరాటం విఫలమైందని అంగీకరిస్తూ 2025 అక్టోబర్‌లో భారీ ఎత్తున క్యాడర్‌తో కలిసి లొంగిపోయారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలతో గిరిజన యువతలో మార్పు వచ్చింది. కొత్త రిక్రూట్‌మెంట్లు ఆగిపోవడం, ఉన్న క్యాడర్ అనారోగ్య సమస్యలతో ఉండటం వల్ల పార్టీ బలహీనపడింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర హోంశాఖ పెట్టుకుంది. మావోయిస్టు ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన లీడర్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎన్ కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత ఇంకా రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్టు లీడర్లు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తేల్చారు. పార్టీ జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కేంద్ర కమిటీ సభ్యుు మల్లా రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ కీలక నేతలు సరెండర్ అవడంతో అజ్ఞాతంలో ఉన్న వారి సంగతేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. అజ్ఞాతంలో ఉన్న వారిలో మావోయిస్ట్ పార్టీ మాజీ చీఫ్, సీనియర్ లీడర్, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, సెంట్రల్ కమిటీ మెంబర్ పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, సైనిక వ్యవహారాల ఇన్‌చార్జి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, కమ్యూనికేషన్ వింగ్ ఇన్‌చార్జి వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు, సెంట్రల్ కమిటీ మెంబర్ జోడే రత్నబాయి అలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్ రావు అలియాస్ ప్రభాకర్, బెటాలియన్ ఇంఛార్జ్ కేసా సోది వంటి వారి నిర్ణయం ఏంటో తేలాల్సి ఉంది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో కథ ముగించే పనిలో కేంద్ర హోంశాఖ ఉంది. దేవ్ జీది మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో కీలక పాత్ర. దేవ్ జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. తిరుపతిది దళిత కుటుంబ నేపథ్యం. కోరుట్ల టౌన్ లోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన తిరుపతి ఇంటర్ వరకు చదివాక.. 1980ల్లో నాడు ఉద్యమ సంస్థగా ఉన్న పీపుల్స్‌వార్‌లో చేరారు. అప్పట్లో జగిత్యాల జైత్రయాత్రతో ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఒక ఉద్యమం ఎగసి పడింది. ఆ ఉద్యమం చాలా మంది యువతపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ ఎఫెక్ట్ తో దేవ్ జీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత 1983లో డిగ్రీ చదువుతుండగానే.. మధ్యలోనే వదిలేసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్- RSU భావజాలానికి ఆకర్షితుడయ్యారు. తర్వాత ఉద్యమంలోకి డైరెక్ట్ గా వెళ్లిపోయాడు తిరుపతి. దేవ్ జీకి తెలుగు, హిందీ, గోండి భాషలపై చాలా పట్టు ఉంది. రిక్రూట్ మెంట్ల కోసం గిరిజన యువతను ఆకర్షించారు. దేవ్ జీకి మావోయిస్టు పార్టీలో సంజీవ్, సుదర్శన్, కుమ్ముదాదా అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. కేంద్ర కమిటీ కార్యదర్శి కంటే ముందు దేవ్ జీ మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు ఇన్‌ఛార్జిగా ఉంటూ సెంట్రల్ రీజినల్ బ్యూరో డైరెక్షన్స్ ఇచ్చే పనులు చూసుకున్నారు. పొలిట్ బ్యూరోలో సభ్యుడిగానూ చాలా కాలం పని చేశారు. 2010లో దంతెవాడలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చంద్రబాబునాయుడిపై అలిపిరి దాడి ఘటనలో దేవ్‌జీ కీ రోల్ పోషించినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయ్. NIAకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న దేవ్‌జీపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌తోపాటు కోటి రూపాయల దాకా రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ చరిత్రలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి తర్వాత ఇదే జిల్లాకు చెందిన తిరుపతికి మరోసారి అవకాశం ఇచ్చింది పార్టీ. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్ కౌంటర్ తర్వాత తిరుపతికి అవకాశం దొరికింది. అయితే మావోయిస్టు కీలక నేతలంతా లొంగుబాటు దిశగా అడుగులు వేయడం, ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగుస్తుండడం, అడవుల్లో ఉండే పరిస్థితులు లేకపోవడం, వేల సంఖ్యలో CRPF బలగాలతో గాలింపులు జరుగుతుండడంతో దేవ్ జీ లొంగిపోక తప్పలేదంటున్నారు. అటు లొంగిపోయిన వారిలో మల్లా రాజిరెడ్డి కూడా ఉన్నారంటున్నారు. ఈయన మారుపేర్లు సాయన్న, మీసాల సత్తన్న, సంగ్రామ్, అలోక్, దేశ్‌పాండే. రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని శాస్త్రులపల్లి గ్రామం. 1975లో ఉద్యమంలో చేరారు మల్లా రాజిరెడ్డి. ఈయనకు పలు కీలక హింసాత్మక ఘటనల్లో పాత్ర ఉంది. మాజీ స్పీకర్ శ్రీపాద రావు హత్యలో కీరోల్ పోషించారంటారు. రాజిరెడ్డిపై కోటి రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలో ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి కీలకంగా ఉన్నారు. ఈయన వయోభారంతో ప్రస్తుతం యాక్టివ్ గా లేకపోయినా ఇంకా అజ్ఞాతవాసం మాత్రం వీడడం లేదు. చాలా మంది ఇప్పటికే లొంగిపోతున్నా ముందుకు రావడం లేదు. దేవ్ జీ లొంగుబాటు నేపథ్యంలో గణపతి దారెటు అన్న ప్రశ్నలు వస్తున్నాయ్. భారత దేశ విప్లవ ఉద్యమ చరిత్రలో గణపతి చాలా కీలకంగా వ్యవహరించారు. ఈయన స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బీర్పూర్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన గణపతి.. అప్పట్లో కొండపల్లి సీతారామయ్య స్థాపించిన పీపుల్స్ వార్ లో చేరారు. 2004లో పీపుల్స్ వార్, MCCI విలీనంతో సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పడింది. దానికి గణపతి వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు పార్టీకి 14 ఏళ్ల పాటు చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. గణపతిపై 2.5 కోట్ల భారీ రివార్డు ఉంది. 2018లో జనరల్ సెక్రటరీ బాధ్యతలకు గణపతి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఈయన ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర దండకారణ్యంలో ఉన్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లారని, చనిపోయారని ఇలా రకరకాల ఊహాగానాలైతే ఈయన చుట్టూ తిరుగుతున్నాయ్. ఆపరేషన్ కగార్ తో గణపతి కూడా లొంగిపోతారా అన్న చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/telangana-maoist-party-45-214496.html





