ఏపీలో తెలంగాణ చిచ్చు?
Publish Date:May 18, 2022
Advertisement
రాజ్యసభ పదవుల పందేరం పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలంగాణ చిచ్చు రాజుకుంది. పెద్దల సభకు పంపించి, గౌరవించాలనేదీ సీఎం జగన్ నిర్ణయం అయితే.. ఏపీలో అర్హత ఉన్న బీసీ నేతలెవరూ లేరా? అనే ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. అంటే.. ఏపీలో ఉన్న బీసీ నేతలెవరూ జగన్ దృష్టిలో పనికిరానివారా అంటూ నిలదీస్తున్నారు. ఏపీలోని బీసీలను కించపరిచే విధంగా తెలంగాణ నుంచి ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు ఏపీ నుంచి ఎంపిక చేయడంపై పలువురు బీసీ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో ఏర్పడనున్న నాలుగు రాజ్యసభ స్థానాల ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో ఇప్పటికే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డికి కొనసాగింపునిచ్చారు. తన వ్యక్తిగత కేసులను కోర్టుల్లో వాదించే నిరంజన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మిగిలిన రెండు స్థానాల్లోనూ బీసీలైన బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యను ఎంపిక చేశారు. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో సగం బీసీలకే కేటాయించడం గమనార్హం. బీసీ ఓటు బ్యాంకును చీల్చేందుకు జగన్ రెడ్డి రాజకీయంగా ఎత్తుగడ వేసినప్పటికీ ఏపీలో సరైన బీసీ నేతలే లేరన్నట్లు జగన్ తెలంగాణ వ్యక్తి ఆర్.కృష్ణయ్యను ఏపీ నెత్తిన ఎక్కించడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. పెద్దల సభకు వెళ్లే అర్హతన ఏపీలోని 140కి పైగా ఉన్న బీసీ కులాల్లోని ఏ ఒక్క నేతకీ అర్హత లేదా? జగన్ రెడ్డీ అంటూ టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు నేరుగా ప్రశ్నించారు. లేదా ఏపీలో నివసిస్తున్న బీసీలు బీసీలే కాదనేది జగన్ రెడ్డి ఉద్దేశమా? అని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ నుంచి నేతను తెచ్చిన నెత్తికి ఎక్కించుకోవడం ఏంటని తూర్పాపట్టారు. నిధులు, విధులతో పసాటు అసలు కూర్చునేందుకు కుర్చీ కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేషన్లను ఏపీ బీసీలకు విదిల్చి, తెలంగాణ వారికి అత్యున్నత రాజ్యసభ స్థానాలు కట్టబెట్టడం అంటే.. ఏపీలో బీసీ నేతలకు వెన్నుపోటు పొడవడమే అంటూ చింతకాయల అయ్యన్న పాత్రుడు చింతనిప్పులు చెరిగారు. తెలంటగాణకు చెందిన వ్యక్తులకు ఏపీ కోటాలోని రాజ్యసభ స్థానాలు ఎలా కేటాయిస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయిన మొదటి రోజు నుంచే జగన్ రెడ్డి ఏపీ నీళ్లు, నిధులు, నియామకాలను తెలంగాణకి దోచిపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నుంచి రాజ్యసభకు పంపిస్తున్న ఇద్దరు బీసీలు బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యకు రాజకీయ జీవితం ఇచ్చిందే టీడీపీ అనే విషయం గుర్తుచేశారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. వైసీపీతో బీసీలు లేరు కాబట్టే టీడీపీ నుంచి వచ్చిన వారికి రాజ్యసభ సీట్లు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. బీసీలకు పెద్దపీట వేశామని కలరింగ్ ఇస్తున్న జగన్ రెడ్డి అసలు బీసీ రిజర్వేషన్లపై ఏనాడైనా కేంద్రాన్ని ప్రశ్నించారా? అని నిలదీశారు. సీఎం సీటు నుంచి జగన్ తప్పుకుని బీసీలకు ఇచ్చే దమ్ముందా? అని యనమల సవాల్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు టీడీపీ కల్పించిన రిజర్వేషన్లను 10 శాతానికి తగ్గించింది వైసీపీ కాదా? అని యనమల ప్రశ్నించారు. వాస్తవానికి పార్టీ ఆవిర్భావం నుంచీ బీసీలు టీడీపీకి పెట్టని కోటలా ఉన్నారు. అయితే.. తాజాగా ఖాళీ ఏర్పడుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో సగం సీట్లు బీసీలకే ఇచ్చామని చెప్పుకోవడం ద్వారా ఆ వర్గాల ఓట్లు కొల్లగొట్టాలనేది జగన్ వ్యూహంగా ఉందనేది సుస్పష్టం. తద్వారా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి బీసీ ఓటర్లను దూరం చేయాలనే రాజకీయ కుట్ర ఉందనేది టీడీపీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్య. మొత్తం మీద ఏపీ కోటాలో తెలంగాణ వ్యక్తిని రాజ్యసభకు ఎంపిక చేసిన జగన్ రెడ్డి తీరుపై ఏపీ వ్యాప్తంగా బీసీల్లో మరింత ఆగ్రహం పెల్లుబికే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-heat-in-andhra-pradesh-25-136066.html





