మీనాక్షీ నటరాజన్ పాదయాత్ర వాయిదా.. ఎందుకో తెలుసా?
Publish Date:Jul 30, 2025
Advertisement
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఈ నెల 31 నుంచి తలపెట్టిన పాదయాత్ర వాయిదాపడింది. ఆగస్టు 5, 6, 7 తేదీలలో కాంగ్రెస్ లో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ యాత్ర వాయిదా పడింది. రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాలలో ఆరు రోజుల పాటు మీనాక్షినటరాజన్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లు గురువారం (జులై 31) నుంచి వచ్చే నెల 6 వరకూ రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాలలో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు చేపట్టాలని షెడ్యూల్ ఖరారైంది. అయితే ఇంతలో బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హస్తిన యానం ఖరారైన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. అది పక్కన పెడితే మీనాక్షి నటరాజ్ చేపట్టదలచిన పాదయాత్రపై పార్టీ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మీనాక్షి నటరాజ్ చేపట్టనున్న పాదయాత్ర పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపడం అటుంచి.. పార్టీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ కు కారణమౌతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేపట్టడం సరికాదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో, శ్రేణుల్లో గట్టిగా వ్యక్తం అవుతోంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రాముఖ్యత తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. అదీ కాకుండా ఈ పాదయాత్ర వలన ప్రతిపక్షాలకు విమర్శించేందుకు ఒక అవకాశం ఇవ్వడమే ఔతుందని అంటున్నారు. అలాగే పాదయాత్రను అడ్డుకునేందుకు విపక్షాలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చని అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లే ఔతుందని అంటున్నారు. వాస్తవానికి పాదయాత్రను విపక్షాలు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను చాటేందుకు చేపడతాయి. అందుకు భిన్నంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే పాదయాత్రలు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని అంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పుడు సమస్యలు తెలుసుకోవడాని పార్టీ పాదయాత్ర చేయడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తుందని పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/telangana-congress-incharge-meenakshi-natarajan-padayatra-postpone-25-203101.html





