తెలంగాణ మంత్రి వర్గంలోకి ముగ్గురు కొత్త మంత్రులు ..సీఎం రేవంత్ ప్రకటన
Publish Date:Jun 8, 2025
Advertisement
తెలంగాణ మంత్రి వర్గంలోకి ముగ్గురు మంత్రులు చేరబోతున్న ఎమ్మెల్యేల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. వీరితో పాటు శాసన సభలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్‌కి శుభాకాంక్షలు చెప్పారు. నేడు మధ్యాహ్నం 12.00 - 12.20 గంటల మధ్య వీరంతా రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీలో ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (మాదిగ)లకు చోటు కల్పించారు. ఎస్టీ అయిన రామచంద్రునాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేశారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కొత్త మంత్రులకు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు ఆయన అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్‌కు కూడా మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తుందని, అందుకే కులగణన చేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ నూతన నియామకాలకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
http://www.teluguone.com/news/content/telangana-cabinet-25-199540.html





