కమలానికి కిషన్ మార్క్.. చీడ పట్టిందా?
Publish Date:Dec 13, 2025
Advertisement
తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది? మనం నానాటికీ ఇక్కడ ఎందుకు దిగజారిపోతున్నాం? అంటూ ప్రధాని మోదీ వాకబు చేశారంటే ఇక్కడి పార్టీ పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఇంతకీ తెలంగాణ బీజేపీ ప్రస్తుతం ఎలా ఉంది? అంటే రాజాసింగ్ ఉదంతమే అతి పెద్ద ఉదాహరణ. రాజాసింగ్ పార్టీలోని ప్రతి అంశాన్ని బయట పెడుతూనే వచ్చారు. ఇంకా అదే పని మీదున్నారాయన. రాజాసింగ్ మాటల ప్రకారం చూస్తే, పార్టీ వ్యక్తి కోసం నడుస్తోన్న వ్యవస్థ కాదు అవస్థగా తయారైనట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి మరెవరో కాదు కిషన్ రెడ్డిగా చెబుతారు రాజాసింగ్. కిషన్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నా.. ఆయన ఆడింది ఆట పాడింది పాటగా పార్టీలో చలామణీ అవుతున్నట్టు కొడుతోందని అంటారు రాజాసింగ్. ఒకప్పుడు తెలంగాణ బీజేపీకి ఇటు కిషన్ తో పాటు దత్తన్న, లక్ష్మన్న అనే ఇద్దరు సీనియర్లు త్రిమూర్తుల్లా కనిపించేవారు. దత్తన్న దాదాపు రిటైర్మెంట్ ప్రకటించగా.. లక్ష్మణ్ బీజేపీ అంతర్గత రాజకీయాలకు బాగా దూరంగా ఉన్నారు. కిషన్ ఒక్కడే ప్రస్తుతం దిక్కు మొక్కుగా ఉన్నారు. ప్రెజంట్ కిషన్ కి బండి సంజయ్ రూపంలో మరో నాయకత్వం తోడున్నట్టే కనిపించినా.. అందులోనూ ఏమంత బండి మార్క్ కనిపించడం లేదని అంటున్నారు. ఇక్కడ కిషన్ మార్క్ పరిపాలనే అధికంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పేరుకు రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఆల్ ఇన్ వన్ గా కిషన్ తనదైన కమల చక్ర వ్యూహం రచిస్తూనే ఉన్నారట. కిషన్ కేంద్ర మంత్రి కావడంతో కొంత బిజీ బిజీగా ఉన్నమాట వాస్తవమే అయినా... పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం తన పట్టు కోల్పోకుండా జాగ్రత్త వహించడంతోనే అసలు ముప్పు తలెత్తినట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడ ఎవరికి వారే యుమనా తీరే అన్నట్టుగా తయారైందట. అంతర్గత ప్రజాస్వామ్యం అనే విషయంలో ఈ 40 ఏళ్ల పార్టీ ఏకంగా 140 ఏళ్ల కాంగ్రెస్ తో పోటీ పడుతోందంటున్నారు కొందరు కమలనాథులు. మోడీ అడుగుతున్నట్టు.. బీజేపీ పతనం ఎలా ప్రారంభమయ్యిందో చూస్తే.. నాడు బీఆర్ఎస్ అధికార పార్టీగా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో ప్రజల దృష్టిలో నిలిచిన పార్టీ బీజేపీనే. కాంగ్రెస్ ఎక్కడో మూడో స్థానంలో ఉన్నట్టు కనిపించింది. అయితే ఇటు కర్ణాటక ఫలితాలు రావడంతో కాంగ్రెస్ లో ఒక రకమైన జోష్ మొదలైంది. మన పొలంలోనూ మొలకలొస్తాయ్ అన్న ఆశ ఇక్కడి హస్తంపార్టీ నేతల్లో చిగురించడం మొదలైంది. దీంతో అప్పటి వరకూ అసంఘటితంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకులంతా ఒక్కసారిగా చేయి చేయి కలిపారు. ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ బీజేపీ మూడో స్థానానికి పడిపోయి.. అక్కడే స్థిరపడిపోయింది. ఇక్కడ బీజేపీ పతనానికి మరో కీలకమైన కారణం కవిత వ్యవహారంగానూ చెబుతారు. కవితను అరెస్టు చేయకుంటే బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కుంటున్నాయిన జనం అనుకుంటున్నట్టు ఒకానొక అనుమానం వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అప్పట్లో. దీనికి తోడు ఆనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ దూకుడు ప్రదర్శిస్తూ వచ్చారు. నాలుగు సీట్ల గ్రేటర్ ని 48 సీట్ల వరకూ లాగారు. దీంతో బీజేపీలో కొత్త రక్తం వచ్చిందని పాత రక్తం కనుమరుగయ్యిందనే అనుకున్నారంతా. ఇలాగైతే తన బండారమంతా బట్టబయలై పోతుందని భావించిన కిషన్, మోడీతో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడి.. ఎలాగోలా రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. కిషన్ పై రాజాసింగ్ చేసే ఆరోపణలను బట్టీ చూస్తే ఆయన ఎన్నటికీ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోరు. ఎవరు అధికారంలో ఉంటే వారితో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని.. వ్యక్తిగత లబ్ధి పొందడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని అంటారు. దీంతో కేసీఆర్ కి అనుకూల కిషన్ రెడ్డి రావడంతో అప్పటి వరకూ రాష్ట్ర కమలదళంలో ఉన్న జోష్ మొత్తం నీరుగారిపోయినట్టు అంచనా. అప్పటికీ.. రాష్ట్రంలో బీజేపీకి అంతో ఇంతో ఉన్న ఆదరణ కొద్దీ ఇటు ఇద్దరు సీఎం అభ్యర్ధులు పోటీ చేసిన కామారెడ్డిలో ఢంకా బజాయించడంతో పాటు మొత్తం ఎనిమిది చోట్ల అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. ఆపై 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటడంతో 8 ఎంపీలను గెలవగలిగింది. ఇక ఎమ్మెల్సీల పరంగానూ గెలుపు బావుటా ఎగురవేయగలిగింది. స్థానిక సంస్థల్లోనూ ప్రభావం చూపించాల్సిన కమలం పార్టీ చతికిల పడింది. కిషన్ రెడ్డి పుణ్యమాని.. పార్టీలో ఎక్కడిక్కడ బ్యాచ్ లు గా విడిపోయినట్టు తెలుస్తోంది. ఇటు ఎంపీలు ఒక గ్రూప్, ఎమ్మెల్యేలు మరో గ్రూప్, ఆపై సీనియర్లు ఒక గ్రూప్, కొత్తగా వచ్చిన వారు ఇంకో గ్రూప్ లుగా విడిపోయి.. ప్రస్తుతం దశ- దిశ.. కరవై నానా అగచాట్లు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన ప్రధాని మోడీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం ఒక స్వయంకృతాపరాధం. ఎందుకంటే కిషన్ రెడ్డి స్వభావం గురించి తెలిసి కూడా పార్టీలోని ప్రతి ఎంపిక కదలికలను ఆయన పర్యవేక్షించేలా చేయడంతోనే అసలుకే మోసం వచ్చేలా కనిపిస్తోందని వాపోతున్నారు రాజాసింగ్ వంటి వారు. అసలక్కడ ఉన్నది భారతీయ జనతాపార్టీ కాదు.. కిషన్ రెడ్డి జనతా పార్టీ అంటారు రాజాసింగ్. మరి ఈ విషయాలేవీ మోడీకి తెలీదనుకోవాలా? ఏంటన్నది పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/telangana-bjp-45-210920.html




