అయినా ..ఆయనే బీజేపీ అధ్యక్షుడు !
Publish Date:Jun 28, 2025
Advertisement
వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు సంవత్సర కాలం పైగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. విశ్వసనీయ సమాచారం మేరకు, మరో రెండు రోజులో,జూన్ 30 న నామినేషన్లు,జూలై 1 న నూతన అధ్యక్షుని ఎన్నికకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి,వచ్చే నెల (జులై) 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగానే,బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని, నిర్ణయించిన నేపధ్యంలో,ఈలోగా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా, రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరగని మిగిలిన అన్ని రాష్ట్రాలలో జులై 15లోగా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది.ఇదే విషయాన్ని, బీజీపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుకే. లక్ష్మణ్ ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అప్పటినుంచే, ఆసవహుల పరుగులు మొదలయ్యాయి. అదలా ఉంటే, బీజేపే నూతన అధ్యక్షుని ఎన్నిక విషయంలో, పార్టీ అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోందని, పార్టీ వర్గాల అంతర్గత సమాచారంగా తెలుస్తోంది. ముందున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలకు, ప్రాధాన్యత ఇస్తూనే 2028 అసెంబ్లీ ఎన్నికల విజయం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అంతిమ లక్ష్యంగా దీర్ఘకాల లక్ష్యంతో, అధ్యక్షుని ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడుఎన్నికయ్యే అధ్యక్షుని నాయకత్వంలోనే 2028 ఎన్నికలకు వెళ్ళవలసి ఉంటుందన్న అంచనాతో తాత్కాలిక వ్యూహంతో కాకుండా దీర్ఘకాలిక వ్యూహంతో నూతన అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు, ‘తెలుగు వన్’ చెప్పారు. అయితే,అది ఎవరనే విషయంలో మాత్రం ఇంతవరకు అధిష్టానం నోటినుంచి సంకేతం రాలేదని అంటున్నారు. అయితే, ప్రస్తుతానికి వినిపిస్తున్న నలుగురు ఎంపీల పేర్లలో. మల్కాజిరి ఎంపీ, ఈటల రాజేందర్ పేరు ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది.నిజానికి,ఈటల పేరు, ఎప్పుడోనే ఖరారైందని, అనుకోని సంఘటనలు, అనూహ్య పరిణామాల కారణంగా, ప్రకటన వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఇటీవల తెర పైకి వచ్చిన, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణకు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా హాజరైన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, చెప్పిన విషయాలు, కొంత వివాదస్పద మయ్యాయి.ఈ కారణంగా, ఆయన అధ్యక్షుని రేస్’లో వెనక పడ్డారని, నిజామాబాదు ఎంపీ ధర్మపురి ఎంపీ ముందుకు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటికీ ఈటలే రేసులో ముందున్నారని, పార్టీ అంతర్గత సమాచారంగా తెలుస్తోంది. అయితే,ఈటలతో పాటుగా, పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘనందన్‌రావు, డీకే.అరుణ కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, పాత కొత్త లెక్కల్లో భాగంగా, ముందు నుంచి రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ ఎమ్మల్యే చింతల రామచంద్రా రెడ్డి,తో పాటుగా, కల్వకుర్తి నియోజకవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన, పార్టీ సీనియర్ నాయకుడు తల్లోజు ఆచారి పేరు కూడా పార్టీ సర్కిల్స్’లో వినిపిస్తోంది. అయితే, అంతిమంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, అనేది అధికారిక ప్రకటన తర్వాత కానీ, తెలిసే అవకాశం లేదని అంటున్నారు. అయితే, రేపు (జులై29) కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్న నేపధ్యంలో, రానున్న 24 గంటల్లో మరికొంత క్లారిటీ రావచ్చని పార్టీ వారలు భావిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/telangana-bjp-39-200857.html





