ప్రయాణికులకు షాక్: తెలంగాణలో ఆటో ఛార్జీలు బాదుడు.!
Publish Date:Oct 2, 2026
Advertisement
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.! తెలంగాణ రాష్ట్రంలో ఆటోరిక్షా ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వం కొత్త విధానాన్ని ఖరారు చేసింది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రయాణికులపై భారం నియంత్రించే విధంగా టారిఫ్‌ను సవరించింది. కొత్త విధానంలో కనీస ఛార్జీ, అదనపు దూరానికి వసూలు చేసే మొత్తం, వెయిటింగ్ ఛార్జీలు, రాత్రి సమయపు రేట్లు, లగేజీ రుసుములకు సంబంధించిన నిబంధనలను స్పష్టం చేశారు. కొత్త టారిఫ్ ప్రకారం ఆటోలో తొలి 1.6 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ఆ దూరం దాటిన తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.14 చొప్పున ఛార్జీ పెరుగుతుంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ రద్దీ, ఇతర పరిస్థితుల కారణంగా ఆటో కొంతసేపు కదలకుండా నిలిచిపోయినా వెయిటింగ్ ఛార్జీ వర్తిస్తుంది. ఈ ఛార్జీని నిమిషానికి 75 పైసలుగా నిర్ణయించారు.రాత్రి సమయంలో ఆటో సేవలను వినియోగించే వారికి సాధారణ టారిఫ్ వర్తించదు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణిస్తే సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని ప్రత్యేక ఛార్జీ కాలంగా నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే సామానుకు సంబంధించి కూడా కొత్త విధానంలో స్పష్టత ఇచ్చారు. సాధారణ పరిమాణంలో ఉండే బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్‌తో పాటు 60×40 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణం కలిగిన అటాచ్డ్ కేస్ లేదా బ్యాగ్‌కు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.అయితే నిర్దేశిత పరిమాణం కంటే పెద్దగా ఉండే ప్రతి ప్యాకేజీకి రూ.0.50 లగేజీ ఛార్జీగా వసూలు చేస్తారు. ఒక ఆటోలో మొత్తం 100 కిలోగ్రాముల వరకు లగేజీని మాత్రమే అనుమతిస్తారు.కొత్త ఛార్జీలకు అనుగుణంగా ఆటోల్లోని డిజిటల్ మీటర్లను కూడా తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. ప్రయాణం ప్రారంభించి మీటర్‌ను ఆన్ చేసిన వెంటనే రూ.30 కనీస ఛార్జీగా నమోదు కావాలి.తొలి 1.60 కిలోమీటర్ల దూరం పూర్తయ్యే వరకు ఇదే కనీస ఛార్జీ కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రతి 100 మీటర్ల దూరానికి రూ.1.40 చొప్పున ఛార్జీ పెరిగేలా మీటర్‌ను రీసెట్ చేయాలి.ప్రయాణికుల నుంచి సరైన ఛార్జీలు వసూలు చేయడంతో పాటు మీటర్లలోనూ కొత్త టారిఫ్ సక్రమంగా ప్రతిబింబించేలా చూడాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. కొత్త విధానం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు. [ Telangana auto fare hike, auto minimum charge Rs 30, Telangana transport department, auto charges per km, Hyderabad auto news, CM Revanth reddy, Minister ponnam prabhakar, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/telangana-auto-fare-hike-25-233210.html





