అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్.. నిజమేనా?
Publish Date:Feb 17, 2025
.webp)
Advertisement
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతారా? ప్రతిపక్ష నేతగా తన గళం వినిపిస్తారా? అన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ వర్గాలు ఔననే అంటున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేసీఆర్..అహంకారపూరిత వ్యవహార శైలి కారణంగానే 2023 ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయారు. జనం ఆయన అహంకారాన్ని భరించలేక బీఆర్ఎస్ పార్టీని ఓడించి సాగనంపారు.
దారుణమైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ఆత్మ విమర్శ చేసుకుని, పద్ధతులలో మార్పులు చేసుకోకుంటే మీ సేవలు మాకిక అవసరం లేదని ఓటు ద్వారా కుండబద్దలు కొట్టారు. అయితే ఓటమి తరువాత కూడా కేసీఆర్ లో మార్పు రాలేదు. బీఆర్ఎస్ ను ఓడించి ప్రజలు తప్పు చేశారంటూ ఓటమి తరువాత ఒకటి రెండు సందర్భాలలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయాలంత ఎత్తున ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు. తాను పదేళ్ళపాటు అద్భుతమైన పరిపాలన అందించాననీ, తాను తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు అద్భుతమైనవనీ చెప్పుకుంటున్నారు. మేడిగడ్డ కుంగుబాటు చాలా చాలా చిన్న విషయమని చెబుతున్నారు. జనం శుష్కవాగ్దానాలకు లొంగిపోయి.. బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశారని అంటున్నారు. అందుకు ఇప్పుడు బాధపడుతున్నారనీ, మళ్లీ తనవైపు, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రజలలో ఈ పరివర్తన వచ్చింది కనుకే ఇప్పుడు తాను మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పకనే చెబుతున్నారు.
ఇప్పుడు ఇక తానేమిటో చూపిస్తాననీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై రేవంత్ సర్కార్ ను నిలదీస్తాననీ అంటున్నారు. అంతే కాదు పార్టీ ఎమ్మెల్యేలకూ, మాజీ మంత్రులకు స్వయంగా ఫోన్ చేసి మరీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మిస్ కాకుండా హాజరు కమ్మడి ఆదేశిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాను కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతాననీ, ప్రభుత్వాన్ని సభ వేదికగా ఎండగడతాననీ చెబుతున్నారు.
2023 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత ప్రజలకు ముఖం చాటేసిన కేసీఆర్ ఇప్పుడు ఏడాది తరువాత ఇక చూస్తోండి నా తడాఖా అంటున్నారంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. ఓటమి తరువాత రాజీనామాను సైతం స్వయంగా గవర్నర్ కు ఇవ్వకుండా తన పీఏతో పంపించి, రాత్రికి రాత్రి క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు పారిపోయిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కాగా వ్యూహరచన చేసుకున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే సవాల్ చేస్తున్నా ఇంత కాలం మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. ఇఫ్పుడు అసెంబ్లీ వేదికగా తన గళాన్ని వినిపించడానికి రెడీ అవుతున్నారు.
http://www.teluguone.com/news/content/telamgana-former-cm-kcr-to-attend-assembly-budget-session-39-193025.html












