ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన గిల్ సేన
Publish Date:Jul 6, 2025
Advertisement
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ ముందుండి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ విజయంతో సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో ఇంగ్లాండ్ ను ఔట్ ప్లే చేసి 336 పరుగుల ఆధిక్యతతో అద్భుత విజయాన్ని చేజిక్కించుకుంది. తొలుత టీమ్ ఇండియా బ్యాటర్లు.. ఆ తరువాత బౌలర్లు అద్బుత ప్రదర్శన చేశారు. శుభమన్ గిల్ టీమ్ ఇండియా టెస్టు జట్ట పగ్గాలు చేపట్టిన తరువాత ఇదే తోలి విజయం. అలాగే ఎడ్జ్ బాస్టన్ లో టీమ్ ఇండియా విజయాన్ని అందుకోవడం కూడా ఇదే తొలిసారి. కెప్టెన్ గిల్ అద్భుత బ్యాటింగ్ కారణంగా రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు టీమ్ ఇండియా భారీ లక్ష్యన్ని నిర్దేశించింది. ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లను ఔట్ చేయడంతో 608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 271 పరుగులకే ఆలౌటై భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా 587 పరుగుల భరీ స్కోరు సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో రాణించారు. ఇక యశస్వి జైస్వాల్ 87 పరుగులు, రవీంద్ర జడేజా 89 పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ 158, జేమ్ స్మిత్ 184 నాటౌట్ సెంచరీలతో మెరిశారు. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లోనూ స్కిప్పర్ శుభమన్ గిల్ 161 పరుగులతో భారీ సెంచరీ చేశాడు. అతడికి రిషభ్ పంత్ 65, జడేజా 69 సహకారం అందించారు. దీంతో భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ లక్ష్య సాధనకు ప్రయత్నించలేదు. డ్రా కోసం బజ్ బాల్ రిథమ్ లోకి వెళ్లకుండా ఢిఫెన్స్ ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 336 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఎడ్జ్ బాస్టన్ లో టీమ్ ఇండియా గొప్ప విజయం సాధించిందంటూ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమ్ ఇండియా గెలుపుపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో స్పందిచిన కోహ్లీ.. శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఎడ్జ్ బాస్టన్ లోని ఫ్లాట్ పిచ్ పై సిరాజ్, ఆకాశ్ దీప్ లు చేసిన బౌలింగ్ ప్రదర్శన గొప్పగా ఉందని పేర్కొన్నారు. మరో మాజీ కెప్టెన్ గంగూలీ కూడా శుభమన్ గిల్ సేన విజయంపై స్పందించాడు. శుభ్‌మన్ గిల్ అండ్ టీమ్ బ్యాట్‌తో, బాల్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆకాష్ దీప్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు.బుమ్రా లేని లోటు కనబడనీయలేదని పేర్కొన్నాడు. అలాగే గిల్ బాధ్యతతో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.
http://www.teluguone.com/news/content/team-india-historical-victory-in-edgbaston-25-201417.html





