జగన్‌ను ఢీ కొట్టాలంటే.. టీడీపీ మారాల్సిందేనా? నేతల్లో మార్పు రావాలా?
Publish Date:Dec 20, 2021

Advertisement
20 ఏళ్ల క్రితం చంద్రబాబు ఇమేజ్ ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉంది. అసలేమాత్రం చెక్కు చెదరలేదు. వీసమెత్తు కూడా తగ్గనే లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. హైదరాబాద్ నవ నిర్మాతగా ఎంత పేరుగాంచారో.. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా అంతకంటే ఎక్కువే పాపులారిటీ వచ్చింది. అమరావతి రూపశిల్పిగా, సన్‌రైజ్ స్టేట్ రూపకర్తగా మరింత ఉన్నతంగా నిలిచారు. అంతా బాగుండి.. మరి, 2019 ఎన్నికల్లో ఏం జరిగింది? టీడీపీ ఎందుకంత ఘోరంగా ఓడిపోయింది? అంటే.. చంద్రబాబుపై వ్యతిరేకతతో కాదు.. జగన్ అరచేతిలో చూపించిన అత్యాశతో రాష్ట్ర భవిష్యత్తు అంథఃకారమయంగా మారిందంటున్నారు. సన్‌సెట్ స్టేట్‌గా మారిన ఏపీలో మళ్లీ సన్ రైజ్ కావాలంటే.. జగన్ పోవాలి.. చంద్రబాబు రావాలి.. అంటున్నారు.
అలా జరగాలంటే ముందు టీడీపీ మారాలి. పార్టీ నాయకుల్లో మార్పు రావాలి. సో కాల్డ్ సీనియర్స్‌ను నెత్తినపెట్టుకోవడం కాకుండా.. సమర్థులైన నవ తరంగాన్ని టీడీపీలో ప్రోత్సహించాలి. కొత్త అనే ఏకైక కారణంతో.. సత్తా ఉన్న నాయకులను పక్కనపెట్టేయకుండా.. ప్రజల కోసం పని చేస్తారనే నమ్మకం.. కష్టకాలంలో పార్టీకి కట్టుబడి ఉండే నాయక గణాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే, మోనార్క్‌లాంటి జగన్‌ను.. పసలేని నాయకులతో నెగ్గుకురావడం కష్టం..అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
టీడీపీలో మార్పు రావాలని చెప్పడానికి అనేక ఉదహారణలు. గద్దె నెక్కినప్పటి నుంచీ పసుపు దళాన్నే టార్గెట్ చేస్తూ.. కేసులు, కుట్రలు, దాడులతో భయోత్పాతం సృష్టిస్తున్న అధికార పార్టీ దారుణాలకు ఎదురొడ్డి పోరాడుతున్నది కొందరే. అచ్చెంన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్, చింతమనేని, యరపతినేని, పరిటాల, జేసీ, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల, దేవినేని, పట్టాభి, బోండా ఉమా, బుద్దా వెంకన్న లాంటి ఓ పది మంది నాయకులు మాత్రమే పోరాడే సాహసం చేస్తున్నారు. మరి, టీడీపీ అంటే ఈ పదిమందేనా? మిగతా నేతలంతా ఎక్కడ దాగున్నారు? అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన గంటా, నారాయణ, కళా, పత్తిపాటి.. లాంటి సో కాల్డ్ టీడీపీ లీడర్లంతా ఇప్పుడు ఏ మూలన నక్కారు?
ఉరకలెత్తే రక్తంతో ఉవ్వెత్తున పోరాటం చేయాల్సిన టీడీపీ యంగ్ తరంగ్ సైతం.. చేష్టలుడిగి.. చేవచచ్చి.. తమ స్వార్థమే చూసుకుంటోంది. నారా లోకేశ్, పరిటాల శ్రీరాం, రామ్మోహన్ నాయుడు.. లాంటి ఓ ముగ్గురు, నలుగురు యువ నాయకులు మాత్రమే జగన్‌రెడ్డి ప్రభుత్వంపై అలుపెరగకుండా పోరాడుతున్నారు. మరి, మిగతా యంగ్ టర్క్స్ అంతా ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు?
బరితెగించి బూతులు, దాడులతో అడ్డగోలు అరాచక రాజకీయాలు చేస్తున్న వైసీపీని ఢీకొట్టాలంటే.. టీడీపీలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మార్పు నాయకులతోనే సాధ్యం. కేవలం పాత, సీనియారిటీ ప్రాతిపదికనే కాకుండా.. పనికొచ్చే, పార్టీకి కట్టుబడి ఉండే.. అనే లైన్ మీద కొత్త నాయకులను ఎంకరేజ్ చేయాల్సిందే. అంతా కలిసి సమిష్టిగా, మరింత దూకుడుగా పాలిటిక్స్ చేయాల్సిందే. అలా జరగాలంటే.. వచ్చే ఎన్నికల్లో జగన్‌రెడ్డికి ఝలక్ ఇవ్వాలంటే.. టీడీపీ అధినేత మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం జగన్ పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని.. పదునైన ఆయుధంగా మార్చుకోవాలంటే.. నాయకులకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీడీపీ కార్యకర్తల కర్మాగారం అంటారు. అభిమానులకు, అనుచరులకు కొదవ లేదు. కావలసిందంతా చంద్రబాబు, లోకేశ్‌లా ముందుండి నడిపించే నాయకులే.
http://www.teluguone.com/news/content/tdp-should-change-to-fight-against-ycp-25-128749.html












