పోలీసులా.. ప్రైవేట్ సైన్యమా? ఏపీలో ఏం జరుగుతోంది..
Publish Date:Jun 8, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామ రాజు అరెస్ట్ , ఆ తర్వాత జరిగిన ఘటనపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీ సీఐడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విశాఖలో ఫార్మసీ ఉద్యోగిపై జరిగిన పోలీసుల దాడి ఘటన తీవ్ర దుమారం రేపింది. లాక్ డౌన్ సమయంలో చాలా ప్రాంతాల్లో పోలీసుల తీరుపై జనాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరును ఎండగడుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విశాఖలో నడిరోడ్డుపై దళిత యువతి లక్ష్మీ అపర్ణను పోలీసులు అడ్డుకున్న తీరును ప్రస్తావిస్తూ.. ప్రజల హక్కులను హరిస్తున్న వైనాన్ని తన లేఖలో చంద్రబాబు వివరించారు. పోలీసులు నిరంకుశ పాలకుల ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారని, ఇలాంటి సమయాల్లో ప్రజలకు కావాల్సింది ఆదుకునే ప్రభుత్వం, స్నేహ హస్తం అందించే పోలీసులు అని వివరించారు. కానీ, అందుకు విరుద్ధమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలిపారు. విశాఖలో మొన్న లక్ష్మీ అపర్ణ అనే దళిత యువతి, మరో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. ప్రస్తుత వైసీపీ పాలనలో ప్రజల హక్కులను హరించే విధంగా పోలీసుల తీరు ఉందని పేర్కొన్నారు. ఒక రాష్ట్రాధిపతిగా వ్యవస్థను చక్కదిద్దే దిశగా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ ను కోరారు.
http://www.teluguone.com/news/content/tdp-chief-chandrababu-write-letter-to-governer-over-police-attacks-39-117190.html





