టీడీపీలో టికెట్ ఫర్ సేల్ సీజన్ 2
Publish Date:Nov 9, 2025
Advertisement
టీడీపీని కోట్లకు టికెట్ల గొడవ ఒక ఊపు ఊపేస్తోంది. శనివారం నాడు తిరువూరు వ్యవహారం క్రమశిక్షణా కమిటీ ముందు చర్చకు వచ్చింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాను ఎంపీ చిన్నికి ఈ నియోజకవర్గ టికెట్ కోసంగానూ రూ. 5 కోట్లు ఇచ్చానంటూ సంచలనం రేకెత్తించారు. విజయవాడ ఉత్సవ్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను సొంత ఖర్చుతో నిర్వహించే తానేంటి? ఇలాంటి వసూళ్లు చేయడమేంటన ఆయన పెద్ద ఎత్తున రియాక్టయ్యారు. ఈ వ్యవహారంపై ఇరువురు నేతలను పిలిచి.. ఒక నివేదిక రూపొందించి అధినేత చంద్రబాబుకు సమర్పించారు వర్లరామయ్య తదితర పార్టీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు. ఇదిలా ముగిసిందో లేదో మరో కొత్త టికెట్లకు కోట్ల గొడవ తెరపైకి వచ్చింది. అదే రైల్వే కోడూరు సీటు కోసం రూ. 7 కోట్ల వరకూ ఇచ్చిన వ్యవహారం. సుధా మాధవి అనే ఒక టీడీపీ మహిళా కార్యకర్త వేమన సతీష్ అనే టీడీపీ ఎన్నారైనేత పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను సతీష్ కి డబ్బులు ఇచ్చే వీడియోతో పాటు.. ఇతర ఆధారాలను ఆమె బయట పెట్టారు. అదెలా ఇచ్చారని ఆమెను అడిగితే.. వేమన సతీష్ చంద్ర బాబు, భువనేశ్వరి, లోకేష్ వంటి వారు తనకు బాగా తెలుసునని వారితో ఆయన ఫోటోలు దిగడం చూసి నమ్మి ఇచ్చామని అన్నారామె. సతీష్ కి థఫ థఫాలుగా తన ఆస్తిపాస్తులను అమ్మి మరీ 7 కోట్ల మొత్తం చెల్లించినట్టు చెప్పారామె. ఇప్పుడు చూస్తే ఆ సీటు రాలేదని.. తాను నిండా మునిగిపోయాననీ... తాము రోడ్డున పడ్డామనీ, తన భర్త మంచాన పడ్డాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితురాలు సుధా మాధవి. పార్టీకి ఉన్న సమస్యలు చాలవన్నట్టు ఇప్పుడీ కొత్త తలనొప్పి తోడయ్యింది. ఇటీవలి క్రమశిక్షణ కమిటీ తిరువూరు సహా మొత్తం 7 నియోజవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు ఫించన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వంటి విషయాలకు దూరంగా ఉన్నట్టు గుర్తించి వారిపై కూడా చర్చించారు. ఇక నియోజకవర్గానికో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. తాజాగా ఈ వార్త కూడా వెలుగులోకి రావడంతో.. ప్రస్తుతం పార్టీలో ఇదో కలకలంగా మారింది. ఇంతకీ వేమన సతీష్ ఎవరు? ఆ డీటైల్స్ ఏంటన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. తాను చంద్రబాబు జైల్లో ఉన్నపుడు 53 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాననీ.. సొంత వాహనాలు పెట్టుకుని నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగి బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతోపాటు టీడీపీ గెలవాలని ఎంతో కృషి చేశానని చెప్పుకొచ్చారామె. తన కార్యక్రమాలను గుర్తించిన వేమన సతీష్ తనకు బాబు, భువనేశ్వరి, లోకేష్ తెలుసునని రైల్వే కోడూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మబలకడంతో ఆస్తులమ్మి మరీ సొమ్ము చెల్లించినట్టు చెబుతున్నారామె. అప్పుడే తమ గ్రామస్తులు ఈ విషయంపై ధర్నా నిర్వహిద్దామని అంటే తానే వద్దన్నాననీ.. ఇపుడు తమ పిల్లలు విషయం వెలుగులోకి తేవడంతో మీడియా ముందుకు వచ్చాననీ.. ఒక సమయంలో సతీష్ తన మామ పోలీసని.. ఈ విషయం బయటకు తెలిస్తే చంపేస్తానని బెదిరించాడనీ... తమకు ఆయన్నుంచి ప్రాణహాని ఉన్నట్టుగా చెప్పారు సుధా మాధవి. కాబట్టి సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు బాధిత మహిళ సుధా మాధవి.
http://www.teluguone.com/news/content/tdp-39-209213.html





