ఇవేమీ పొత్తులు?
Publish Date:Apr 16, 2014
Advertisement
తెదేపా-బీజేపీ ఎన్నికల పొత్తుల వలన రెండు ప్రాంతాలలో ఆ పార్టీలు ఒకదానివలన మరొకటి చాలా లాభపడతాయని భావించాయి. తాజాగా వెలువడిన సర్వే నివేదిక సైతం అదే దృవీకరిస్తోంది. కానీ ఈ పొత్తుల కారణంగానే రెండు పార్టీలలో టికెట్స్ దొరకని నేతలు తిరుగుబాటు అభ్యర్ధులుగా పోటీలో నిలబడుతూ వాటి విజయావకాశాలను గండి కొట్టేందుకు సిద్దపడుతున్నారు. ఇక సీమాంద్రాలో బీజేపీ చాల బలహీనంగా ఉన్నపటికీ, దురాశకు పోయి కీలకమయిన కొన్ని సీట్లను దక్కించుకొంది. కానీ అక్కడ నుండి పోటీ చేస్తున్న బలమయిన ప్రత్యర్ధులను డ్డీకొని గెలిచే సత్తాగల అభ్యర్ధులు పార్టీలో లేకపోవడంతో, తన ఓటమికి తానే బాటలు పరుచుకొన్నట్లయింది. ఇక చంద్రబాబు కూడా వ్యక్తిగత, కుటుంబ విభేదాల కారణంగా, వైజాగ్ లోక్ సభ సీటు సిట్టింగ్ యంపీ పురందేశ్వరికి దక్కకుండా చక్రం తిప్పడం వలన ఆ ప్రభావం ఆ ఒక్క లోక్ సభ సీటు మీదే కాకుండా, ఆ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఉన్న ఏడు శాసనసభ నియోజక వర్గాల అభ్యర్దులపైనా తప్పక పడుతుంది. వైజాగ్ సిటింగ్ యంపీ పురందేశ్వరికి తన లోక్ సభ నియోజక వర్గం పరిధిలోకి వచ్చే అన్ని శాసనసభ స్థానాలపైనా మంచి పట్టు ఉంది. కానీ ఆమెను కాదని ఆ సీటుని బీజేపీ సీమాంధ్ర విభాగం అధ్యక్షుడు హరిబాబుకి ఇవ్వడంతో, అది వైకాపాకి సానుకూలాంశంగా మారింది. వైజాగ్ నుండి వైకాపా అభ్యర్ధిగా పోటీకి దిగుతున్న విజయమ్మను ఓడించడం అంత తేలిక కాదు. పైగా ఆమె, ఆమె పార్టీ ప్రభావం వైజాగ్ లోక్ సభ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల మీద చాల ఉంటుంది. గనుక, అక్కడ కూడా తెదేపాకు ఎదురీత తప్పకపోవచ్చును. సులువుగా గెలుచుకోగల కొన్ని స్థానాలలో కూడా గెలుపు కోసం ఎదురీదవలసి రావడం స్వయంకృతాపరాధమే గనుక అందుకు ఎవరినీ నిందించవలసిన పనిలేదు. ఇదే పరిస్థితి 13 జిల్లాలలో మరికొన్ని నియోజక వర్గాలలో కూడా ఉంది. ఇక రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నపటికీ, తెలంగాణాలో తెదేపా, బీజేపీ నేతలు కలిసికట్టుగా ప్రచారం చేయడానికి అయిష్టత చూపుతున్నారు. ఇంతవరకు తెలంగాణాలో చంద్రబాబు నిర్వహించిన ఏ సభలోనూ బీజేపీ నేతలు పాల్గొనలేదు. అదేవిధంగా త్వరలో నరేంద్ర మోడీ కరీంనగర్ మరియునిజామాబాద్ నగరాల్లో నిర్వహించబోయే బహిరంగ సభలలో చంద్రబాబు పాల్గోనబోవడం లేదు. హైదరాబాదులో నిర్వహించబోయే సభలో మాత్రమే చంద్రబాబు కూడా మిగిలిన ఎన్డీయే భాగస్వాములందరితో బాటు నరేంద్ర మోడీతో వేదిక పంచుకొంటారు. ఇంత అయిష్టంగా కలిసి పనిచేయడం వలన ఆ రెండు పార్టీలు ఆశిస్తున్న ప్రయోజనం దక్కుతుందా? లేక వారే ఆ ప్రయోజనాన్ని తమ ప్రత్యర్ధులకు బంగారు పళ్ళెంలో పెట్టి అందజేయబోతున్నారా? కాలమే చెపుతుంది.
http://www.teluguone.com/news/content/tdp-37-32485.html





