విజయ్ గెలిచేస్తాడట...మంత్రుల జాబితా సిద్దం!
Publish Date:Apr 27, 2026
Advertisement
తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి. ఇక, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. విజయ్ పాపులారిటీ, అనూహ్యంగా పెరిగిన పోలింగ్, ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం వంటి కారణాలతో.. టీవీకే ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇక, విజయ్ తన పార్టీ గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారని.. ఆయన ఏకంగా మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే జాబితాను సైతం ఆల్రెడీ సిద్ధం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకీ ఈ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి? అని చూస్తే.. బుస్సీ ఆనంద్. ఈయన టీవీకే జనరల్ సెక్రటరీ. ఈయన విజయ్‌కు అత్యంత సన్నిహితుడు, అంతేనా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి. ఈయనకు అత్యంత కీలకమైన శాఖ- బహుశా హోం లేదా మున్సిపల్ శాఖ.. దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఆదవ్ అర్జున. ఈయన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందారు. ఈయనకు ఆర్థిక లేదా ఐటీ శాఖల బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది.కె.ఎ. సెంగోట్టయన్. గతంలో ఏఐఏడీఎంకే లో సీనియర్ మంత్రిగా పనిచేసిన ఈయన, విజయ్ పార్టీలో చేరడంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉంది. వేణుగోపాల్, మాజీ ఎంపీ. ఈయనకు కూడా సీనియారిటీ కోటాలో చోటు దక్కవచ్చని సమాచారం. కె.జి. అరుణ్‌రాజ్. పార్టీ సిద్ధాంతకర్త, ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది.మహిళా కోటా విషయానికి వస్తే.. విజయ్ తన మంత్రివర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు, ఇందులో భాగంగా విజయలక్ష్మి వంటి మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కేవలం అనుభవం ఉన్నవారినే కాకుండా, చదువుకున్న యువతను కూడా తన కేబినెట్‌లోకి తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేర్లు కేవలం రాజకీయ విశ్లేషకులు, పార్టీ వర్గాల నుంచి అందుతున్న లీకుల ఆధారంగానే ప్రచారంలో ఉన్నాయి. మే 4వ తేదీన వెలువడే ఫలితాల తర్వాతే ఈ జాబితాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తొందర పడి ముందే కూసిన కోయిలలు తర్వాత బొక్క బోర్లా పడ్డం కూడా ఉంది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ జగన్ తన పార్టీ వర్గాల వారిని ఒక హైప్ లో ఉంచడానికిగానూ.. ప్రమాణ స్వీకార వేదిక, హోటళ్ల బుకింగ్ వంటి ఎన్నో ముందస్తు ఏర్పాట్లు చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ, అది కాస్తా తుస్సు మనడంతో వైసీపీ కార్య వర్గమంతా డీలా పడిపోయింది. అన్నట్టు ఎన్డీయే కూటమి చంద్రబాబును తమ తెలుగు బ్రాండ్ అంబాసిడర్ గా చూపితే, విజయ్ తాను జగన్ తో కలసి దిగిన ఫోటోలను ప్రదర్శించారు. ఇప్పుడు చూస్తే ఆయనలా ముందస్తు జాబితాలు సిద్ధం చేయడం వంటి హంగామా చూస్తుంటే ఇదేదో తేడాగా ఉందే అన్న అనుమానాలు కూడా వస్తున్నాయ్. ఎందుకంటే ఏ సర్వే కూడా విజయ్ కి 10- పదిహేను సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా చెప్పలేదు. అందుకే ఈ హంగామా చూస్తుంటే డౌట్ గా ఉందంటున్నారు కొందరు.
http://www.teluguone.com/news/content/tamil-nadu-election-25-218378.html





