రోజూ నాకు పూజ చేయండి.. తలసాని
Publish Date:Jul 21, 2015
Advertisement
*రాజీనామా చేశా *నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్ట *తలసాని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిగ్ గా నడుస్తుంది. ఒక పక్క తలసాని నేను రాజీనామా చేశానని చెప్పుతున్నారు. కానీ రాజీనామా లేఖ ఇంతవరకూ రాలేదని డిప్యూటీ సెక్రటరీ-పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ చెప్పారు. తలసాని రాజీనామా కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరెడ్డి సమాచార హక్కు చట్టం కింద అసెంబ్లీ సచివాలయానికి దరఖాస్తు చేయగా వాళ్లు రాజీనామా లేఖ రాలేదని చెప్పడంతో నిజం బయట పడింది. దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలందరూ తలసాని మీద గుర్రుమంటున్నారు. అటు తలసానితో పాటు కేసీఆర్ ను కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. తలసానితో పాటు కేసీఆర్ కు, గవర్నర్ కు కూడా సంబంధం ఉందని.. వీరు ముగ్గురు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన రాజీనామా పై వస్తున్న విమర్శలకు తలసాని స్పందిస్తూ ఘాటుగా స్పందించారు. 2014 డిసెంబర్ 16న తాను ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజీనామా చేశానని.. ఇప్పటికీ రాజీనామా లేఖను కూడా జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని అన్నారు. ప్రతిపక్షనేతలకు ఏం పనిలేదని.. పొద్దున లేచిన దగ్గరనుండి నా పేరుతో జపం చేస్తున్నారని.. అంతకంటే తన చుట్టూ తిరిగి పూజలు చేసుకోండని విమర్శించారు. రాబోయే ఉప ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఎవరు పోటీకి వస్తారో రండని సవాల్ విసిరారు. పదవులు తనకు కొత్తేమి కాదని.. రాజకీయాలు పక్కన పెట్టి, నాలుగు రోజులు తనది కాదనుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని హెచ్చరించారు. ‘‘అనవసరంగా నా జోలికొస్తే మీ బండారం బయటపెడతా, ఎవరినీ వదిలిపెట్ట’’ అని హెచ్చరించారు. మరోవైపు తలసాని రాజీడ్రామా పై చర్చించేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మంత్రి తలసాని వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తలసాని టీడీపీ పార్టీనుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆతరువాత పార్టీ మారి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ లో మంత్రిగా కొనసాగుతున్నారని.. ఇది చట్ట విరుద్దమని తెలిపారు. తన పదవికి రాజీనామా చేశానని చెప్పి మోసం చేసిన తలసాని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరారు.
http://www.teluguone.com/news/content/talasani-srinivas-yadav-39-48505.html





