అణ్వస్త్ర సామర్థ్యంలో ప్రపంచాన్ని అధిగమిస్తాం.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటన
Publish Date:Jun 23, 2026
Advertisement
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ప్రపంచాన్నిబెంబేలెత్తిస్తున్నారు. అణ్వాయుధాల విషయంలో ఆయన తాజాగా చేసిన ఒక సంచలన ప్రకటన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కలకలాన్ని రేపుతోంది. దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఊహించని రీతిలో పెంచి, ప్రపంచాన్ని అధిగమించే స్థాయికి ఉత్తర కొరియాను తీసుకెళ్లాలని కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన కొరియా వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన ఈ దూకుడు నిర్ణయాలను వెల్లడించారు. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అణ్వస్త్ర దేశంగా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడమే తమ ముందున్న ఏకైక మార్గమని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అణ్వస్త్రాలే దేశ సైనిక సార్వభౌమత్వానికి, రక్షణకు ప్రధాన బలమని కిమ్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేవలం అణ్వాయుధాల పెంపుదల గురించే కాకుండా.. సరిహద్దు రక్షణ, వ్యూహాత్మక ఆయుధాల తయారీపై కింగ్ లక్ష్యాలను నిర్దేశించారు. అందులో భాగంగానే సముద్ర రంగంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వీలుగా దాదాపు పది వేల టన్నుల సామర్థ్యం గల సరికొత్త వ్యూహాత్మక క్షిపణి క్రూజర్ యుద్ధనౌక నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీ చేశారు. రక్షణ రంగంలో సరికొత్త అణు సాంకేతికత ఆధారంగా మరిన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలన్నారు. దక్షిణ సరిహద్దు భద్రతను శత్రువులు ఛేదించలేనంత బలంగా మార్చడంతో పాటు, సరికొత్త అత్యాధునిక నౌకాదళ స్థావరాలను నిర్మించడానికి ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు తన పొరుగు దేశమైన దక్షిణ కొరియాను తమ ప్రధాన శత్రుదేశం గా కిమ్ సర్కార్ అభివర్ణించింది. అమెరికా, దక్షిణ కొరియా మధ్య పెరుగుతున్న సైనిక సహకారం, ఉమ్మడి విన్యాసాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా దేశాలు కలిసి నిర్వహించిన న్యూక్లియర్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశాన్ని కిమ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఎన్‌సీజీ సమావేశం తమ దేశంపై అణు యుద్ధ ప్రణాళికలు రచించడానికి వేదికగా మారిందని ఆరోపించారు. అమెరికా ఆధిపత్య ధోరణికి భయపడే ప్రసక్తే లేదనీ, అందుకే సరిహద్దు ప్రాంతాల్లో సరికొత్త అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను భారీగా మోహరించాలని నిర్ణయించినట్లు కిమ్ ఈ సమావేశంలో విస్పష్టంగా ప్రకటించారు. ఈ భారీ సైనిక వ్యూహాల అమలుకు అనుగుణంగానే పార్టీ అగ్ర నాయకత్వంలో కిమ్ జోంగ్ ఉన్ పెను మార్పులు కూడా చేశారు. నమ్మకమైన కొందరు కీలక నేతలకు రక్షణ విభాగాల్లో పెద్దపీట వేస్తూ పదోన్నతులు కల్పించి, వ్యూహాత్మక లక్ష్యాలను అందుకోవడంలో వెనుకబడిన మరికొందరిని పదవుల నుంచి తప్పించారు.
http://www.teluguone.com/news/content/surpass-the-world-in-nuclear-capabilities-36-223831.html





