తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. ఏపీ ఏకసభ్య కమిషన్ కు సుప్రీం ఓకే!
Publish Date:Feb 23, 2026
Advertisement
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైటైర్డ్ ఐఏఎస్ అధికారి దిలీప్ కుమార్ తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఈ ఏక సభ్య కమిషన్ ప్రభుత్వానికి 45 రోజులలోగా నెయ్యి కల్తీపై నివేదిక ఇవ్వాలని ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం డెడ్ లైన్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. కాగా తెలుగుదేశం కూటమి సర్కార్ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగంపై విచారణకు ఏక సభ్య కమిషన్ నుఏర్పాటు చేయడాన్ని బీజేపీ మాజీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఆయన పిటిషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తోసి పుచ్చింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసు దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించడమేంటంటూ సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయన పిటిషన్ ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసులో ఏపీ ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆ ప్రత్యేక కమిటీ ఓవర్‌లాపింగ్ కిందికి రాదని స్పష్టం చేసింది.
http://www.teluguone.com/news/content/supreme-green-signal-to-ap-government-single-member-commission-36-214526.html





