మహా గవర్నర్ తీరును తప్పుపట్టిన సుప్రీం
Publish Date:May 11, 2023
Advertisement
శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం గవర్నర్ తీరును తప్పుపట్టింది. అలాగే షిండే జారీ చేసిన విప్ ను అప్పటి స్పీకర్ గుర్తించడాన్ని సైతం తప్పుపట్టింది. అయితే సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనకుండానే అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసినందున ఆయనను తిరిగి సీఎంగా నియమించలేమని పేర్కొంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఒక రాజకీయ పార్టీలో చీలికను బలపరీక్ష ద్వారా నిర్ధారించడానికి వీల్లేదని పేర్కొంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన పార్టీ చీలిపోయిందని కాదనీ, పార్టీ శ్రేణులు, కార్యకర్తల స్థాయిలో చీలికను గుర్తించాలనీ పేర్కొంది. సరిగ్గా ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీలో 1995 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో సంభవించిన సంక్షోభ సమయంలో చంద్రబాబునాయుడి నాయకత్వంలోని గ్రూపునే అసలైన తెలుగుదేశం పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. తెలుగుదేశం చీలిక వర్గం నేతగా చంద్రబాబు అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి 1995 సెప్టెంబర్ 15, అదే నెల 29 అలాగే అక్టోబర్ 10, అక్టోబర్ 24 తేదీలలో వరుసగా లేఖలు రాశారు. అలాగే మొత్తం 3694 మంది పార్టీ జనరల్ బాడీ సభ్యులలో 2679 మందిఎన్టీఆర్ స్థానంలో తనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. అలాగే ఎన్నికల సంఘం వద్ద చంద్రబాబుకు మద్దతుగా న్యాయ న్యాయ నిపుణులు కపిల్ సిబల్, రాజేంద్ర చౌదరి, రాకేష్ శర్మ, ఎన్వీ రమణ (ఈయన ఆ తరువాత సీజేఐ అయ్యారు)లు వాదించారు. అయితే ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చిన సమయంలో ఈ ప్రక్రియ ఏమీ జరగలేదు. అయినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం షిండే ను శివసేన అధ్యక్షుడిగా గుర్తించి పార్టీ గుర్తును కూడా కేటాయించింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం ఏకపక్షంగా షిండే వర్గాన్ని అసలు శివసేనగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఎటువంటి వ్యాఖ్యలూ లేయలేదు. అదలా ఉండగా షిండే వర్గం ఎమ్మెల్యేల అనర్హత విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ దేనని సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో ప్రస్తుత స్పీకర్ ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే ఆయన నిర్ణయం ఎలా ఉన్నా సుప్రీం కోర్టు తీర్పుతో మహారాష్ట్ర ప్రజలకు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని అక్రమంగా పడగొట్టారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది.
http://www.teluguone.com/news/content/supreme-find-fault-with-maha-governer-39-155145.html





