రిజర్వేషన్ల పెంపుపై పిటిషన్.. డిస్మిస్ చేసిన సుప్రీం
Publish Date:Oct 6, 2025
Advertisement
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఇందుకు సంబంధించిన కేసు హైకోర్టు విచారణలో ఉండగా సుప్రీను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే హైకోర్టులో స్టే లభించలేదు కనుక సుప్రీంను ఆశ్రయించామని పిటిషనర్లు ఇచ్చిన సమాధానంతో సుప్రీం కోర్టు సంతృప్తి చెందలేదు. స్టే ఇవ్వకుంటే పిటిషన్ వేస్తారా అని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. హైకోర్టులో విచారణలో ఉన్న అంశంపై తాము విచారణ జరపజాలమని స్పష్టం చేసింది. గతంలో ఇదే పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటికి తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. రిజన్వేషన్ల పెంపు వల్ల సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితి దాటినట్లౌతుందన్నది పిటిషనర్ల వాదన. ఇప్పుడు ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేయడంతో ఈ నెల 8న తెలంగాణ హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది. ఒక వేళ తెలంగాణ హై కోర్టు స్టే ఇస్తే.. 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఆగిపోతుంది. ఒక వేళ స్టే ఇవ్వకుంటే స్థానిక ఎన్నికల ప్రక్రియ యథావిధిగా సాగుతుంది.
http://www.teluguone.com/news/content/supreme-court-dismiss-petition-on-reservations-39-207429.html





