సూపర్ సిక్స్ హామీల అమలులో సీబీఎన్ స్పీడ్
Publish Date:Aug 1, 2025
Advertisement
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో ముందడుగు వేయడానికి రెడీ అయిపోయారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం (ఆగస్టు 2) నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కేంద్ర వాటాతో కలిపి మొత్తం రూ.7వేలు అందిస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అమలు సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ, జలవనరుశాఖల ఉన్నతాధికారులతో సీఎం గురువారం (జులై 31) సమీక్ష నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందిస్తామన్న కూటమి హామీని అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ తో నెరవేర్చినట్లయిందన్నారు. ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి, రాష్ట్రప్రభుత్వం మరో రూ.14 వేలు ఇవ్వనుంది. మొదటి, రెండో విడతల్లో రూ.ఐదేసి వేలు చొప్పున, మూడో విడత రూ.4వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. తొలివిడతలో కేంద్రం రూ.2వేలు చొప్పున రూ.831.51కోట్లు విడుదల చేయనుంది. దీంతో ఆగస్టు 2న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో రైతుకు రూ.7వేలు జమ చేస్తాయి. మరోవైపు అన్నదాత సుభీభవ కు సంబంధించి 59,750 గ్రీవెన్సులు నమోదు కాగా... 58,464 దరఖాస్తులు పరిష్కరించడం జరిగింది. ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం 155251 టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచినట్లు చంద్రబాబు చెప్పారు. రైతులకు హామీ ఇచ్చినట్టుగానే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి చూపిస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామనీ, చేసిన మంచిని ప్రజలకు చెప్పాలనీ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. అన్నదాత సుఖీభవ అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒక రోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు వెళ్లాలని, రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని నిర్దేశించారు. భారత్‌పై అమెరికా 25శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బొప్పాయి ధర తగ్గుదలపై సమీక్ష చేసి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/super-eix-promises-implimentation-39-203226.html





