ఇంద్రకీలాద్రిపై వీధికుక్కల బెడద
Publish Date:May 27, 2026
Advertisement
ఆధ్యాత్మిక క్షేత్రం ఇంద్రకీలాద్రి పై ఓ భక్తుడిపై కుక్క దాడి చేసిన ఘటన భక్తులలో భయాందోళనలను నింపింది. పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై వీధికుక్కల బెడద తీవ్రంగా ఉందన్న ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఆలయ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన వినయ్ దంపతులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో అమ్మవారి దర్శనం కోసం మంగళవారం (మే 26) క్యూలైన్లో వేచి ఉండగా అకస్మాత్తుగా ఒక వీధి కుక్క దాడి చేసి కరిచింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భక్తుల ఆందోళనల మధ్య దేవస్థానం సిబ్బంది బాధితుడిని మహామండపం ఏడో అంతస్తులోని వైద్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే అక్కడ కుక్కకాటు నివారణకు అవసరమైన యాంటీ రేబిస్ మందులు అందుబాటులో లేవు. దీంతో కేవలం టిటి ఇంజక్షన్‌తోనే సరిపెట్టేశారు. . కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే దేవస్థానంలో కనీస అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడం భక్తుల్లో అసహనాన్ని రగిలిస్తోంది. దేవస్థానం అధికారుల తీరు పట్ల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/stray-dog-menace-at-indrakiladri-36-220983.html





