రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు తెరలేపిన ఆలోచనాపరుల సంఘం సూచనలు
Publish Date:Aug 12, 2025
Advertisement
ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలన్న నినాదంతో ఆలోచనపరుల వేదిక ఆధ్యర్యంలో ఈ నెల 4 నుంచి 6 వరకు శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మితమైన ప్రాజెక్టులపై అధ్యాయనం జరిగింది. అలా అధ్యయనానికి వెళ్లి వచ్చిన ఆలోచనాపరుల సంఘం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. సూచనలు అనడం కంటే ఆ మేధావుల సంఘం పలు డిమాండ్లు వినిపించింది. అదేమంత ఆషామాషీ కమిటీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపధ్యంలో వారి సూచనలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆ ప్రతినిధి బృందంలో రిటైర్ట్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, రైతు సేవా సమితి అధ్యక్షుడు అక్కినేని భవానీ ప్రసాద్, నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల రంగం విశ్లేషకులు టి. లక్షినారాయణ, నల్లబోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు కృష్ణమూర్తినాయుడు వంటి మేథావులు ఉన్నారు. దీంతో తమ అధ్యయనం తరువాత వారు ఇచ్చిన సూచనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఆలోచనపరుల వేదిక పలు సూచనలు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ అలాగే నీటి వినియోగంలో మెరుగైన పద్ధతులను సూచిస్తూ.. రైతుల అవసరాలు తీర్చడానికి నీటి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి ఈ సూచనలు ఎంతగానో దోహదపడతాయంటున్నారు. ముఖ్యంగా, ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, నీటి వినియోగంలో మెరుగైన పద్ధతులను సూచిస్తూ, రైతుల అవసరాలు తీర్చడానికి, నీటి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి ఆ సూచనలు మేలు చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని, తక్కువ ఖర్చుతో కూడిన, సమర్ధవంతమైన నీటిపారుదల పద్ధతులను ఉపయోగించాలని, స్థానికుల అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను నిర్మించాలని ఆలోచనపరుల సంఘం సూచింది. ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఒక స్పష్టమైన సమయపాలన ఉండాలంది. ఆ క్రమంలో ప్రాజెక్టుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, నీటిపారుదల వ్యవస్థలను ఎప్పటికప్పుడు పరిశీలించి, మరమ్మతులు చేయాలని డిమాండ్ చేసింది. నీటి వనరులను సమర్ధవంతంగా నిర్వహించడానికి సాంకేతికతను ఉపయోగించాల్సి అవసరాన్ని గుర్తు చేసింది. రైతులకు శిక్షణ ఇస్తే.. వారు నీటిని పొదుపుగా ఉపయోగించుకుంటారనీ, నీటిని వృధా చేయకుండా, పొదుపుగా ఉపయోగించాలని పేర్కొంది. బిందు సేద్యం, స్ప్రింక్లర్ సేద్యం వంటి ఆధునిక నీటిపారుదల పద్ధతులను ఉపయోగించాలని గైడ్ చేసింది. పంటల ఎంపికలో నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని,నీటిపారుదల వ్యవస్థలను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆలోచనపరుల సంఘం మేధావులు అంటున్నారు. శ్రీశైలం ఆధారంగా నంద్యాల జిల్లా పరిధిలో నిర్మించిన , నిర్మాణంలో ఉన్న ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు - నగరి సుజల స్రవంతి, కేసీ కెనాల్, చెన్నైకి తాగు నీరు తరలించే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బసకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలుగోడు రిజర్వాయర్, హంద్రీ - నీవా స్రవంతికి నీటిని తరలించే మాల్యాల, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను సందర్భించిన ఆలోచనపరుల సంఘం వివిధ సూచనలు చేసింది. ఎస్పార్బీసీని పూర్తి చేయడానికి రూ.250 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించింది.
ఇక రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఒక సంప్రదింపుల వేదికను ఏర్పాటు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిని అరికట్టాలంటూ ఈ సూచనలను పాటించడం ద్వారా, సాగునీటి ప్రాజెక్టులను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చని ఆలోచనపరుల సంఘం సూచిస్తోంది. ఇంకా పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో యుద్దప్రాతిపకన పూర్తి చేయడానికి అవసరమైన రూ.5000 కోట్ల నిధులను వ్యయం చేస్తే ఈ ప్రాజెక్టుపై ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుకు ఫలితం ఉంటుందని పేర్కొంది.
ఆ క్రమంలో పోలవరం - బనకచెర్ల , రాయలసీ ఎత్తిపోతల పథకాలను విరుమించుకోవాలని కాస్త గట్టిగానే సూచించింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టులను కూడా సందర్శించి, అధ్యయనం చేసి ప్రజలకు వివరాలు తెలియచేస్తామని వెల్లడించింది. మొత్తానికి ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర మేధావులు వెల్లడించిన అంశాలు అందరిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
http://www.teluguone.com/news/content/state-wide-discussion-on-irrigation-projects-39-204054.html





