ఘనంగా గరుడ సేవ – శ్రీవారి మోహినీ రూపం
Publish Date:Oct 20, 2012
Advertisement
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. తిరుమాడ వీధులు గోవింద నామ స్మరణతో మారుమోగాయి. మలమప్పస్వామికి మూలవర్ల ఆభరణాల్ని అలంకరించారు. గరుడసేవ ప్రారంభమయ్యే సమయానికి జోరున వర్షం.. శ్రీవారి గరుడసేవని చూడవచ్చిన భక్తకోటి పాపాలను కడిగిపారేయడానికా అన్నట్టు వరుణుడు ఆకాశగంగని కురిపించాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం. గరుడుడు శ్రీవారి వాహనం. ఓ కాలిని మడిచి మరోకాలిపై నిలిచి స్వామి ఎప్పుడు అనుజ్ఞ ఇస్తారా అని రెప్పవాల్చకుండా ఎదురుచూసే నిజమైన భక్తుడు గరుడుడు. శ్రీవారిని, దేవేరినీ సకలలోకాల్లో విహరింపజేయగల భాగ్యం ఒక్క గరుత్మంతుడికే దక్కింది. తల్లి దాస్యాన్ని విముక్తి చేసి ఆమెకు సద్గతిని కలిగించిన అఖండ శక్తిశాలి గరుత్మంతుడు. గరుత్మంతుడిని సేవించుకుంటే అఖండమైన శక్తి సంప్రాప్తమవుతుంది. సకల నాగదోషాలూ పటాపంచలైపోతాయ్. అనంతుణ్ణి తన వీపుపై మోసే గరుత్మంతుణ్ణి దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యం. మోహనరూపుడైన శ్రీనివాస విభుడు శుక్రవారం ఉదయం మోహినీ రూపంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనాన్ని ప్రసాదించారు. మోహినీ రూపంలో శ్రీవారిని చూసి సకలచరాచర సృష్టీ మోహపరవశంలో మునిగితేలింది.
http://www.teluguone.com/news/content/srivari-navaratri-brahmotsavam-31-18384.html





