నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం వావిలాల గోపాలకృష్ణయ్య
Publish Date:Apr 29, 2020
Advertisement
* ఈ రోజు వావిలాల వారి వర్ధంతి నీరు కావి రంగు ఖద్దరు దుస్తులు, భుజం మీదుగా వేలాడుతూ ఒక గుడ్డ సంచి. దూరం నుంచే చూసి చెప్పొచ్చు ఆ వచ్చేది వావిలాల వారని. ముతక ధోవతి, ముడతలు పడ్డ అంగీ, ఇక ఆ చేతి సంచిలో వుండేవి నాలుగయిదు వేపపుల్లలు, మరో జత ఉతికిన దుస్తులు, నాలుగయిదు పుస్తకాలు, నోటుబుక్కు. 1955 నుంచి 1967 వరకు ఆయన ఇండిపెండెంటుగా గెలుస్తూ వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆయన కాలినడకనే తిరిగేవారు. యెంత దూరమైనా కాలి నడకే. వూరు దాటి వెళ్ళాల్సివస్తే ఆర్టీసీ బస్సు లేదా సెకండు క్లాసు రైలు. ఒకసారి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్నప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళారు. గెస్టు హౌస్ లో దిగిన వావిలాల వారిని మర్యాద పూర్వకంగా కలుసుకునే నిమిత్తం జిల్లా కలెక్టర్ వెళ్లి గదిలో చూస్తె ఆయన లేరు. బయటకు వచ్చి వాకబు చేస్తే ఆ సమయానికి వావిలాల గెస్టు హౌస్ దగ్గర కృష్ణా నదిలో స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ కానవచ్చారు. ‘అదేమిట’ని కలెక్టర్ ఆశ్చర్యంతో అడిగితే, ‘వున్నవి రెండే జతలు, ఏరోజుకారోజే ఉతుక్కోవడం తనకు అలవాట’ ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా లోగడ వ్యవహరించిన మండలి బుద్ధప్రసాద్, వావిలాల గురించిన ఒక ఆసక్తికర కధనాన్ని కొన్నేళ్ళ క్రితం రాసారు.
* విశుద్ధ రాజకీయాలకు చిరునామా 'వావిలాల'
ఒకసారి వావిలాల గుంటూరు నుండి రైల్లో సత్తెనపల్లి వెడుతుంటే ఒక ముసలవ్వ ఆయన్ని తేరిపార చూసి, ‘బాబూ! గోపాల కిష్టయ్యవా’ అందట. ‘అవునవ్వా! నేను నీకు తెలుసా!’అన్నారాయన. ‘తెలియకపోవడమేంబాబూ, నువ్వేగా మాకు బువ్వ పెట్టింది, నందికొండ నువ్వు తీసుకురాకపోతే మాకు బువ్వేడది?’ అందట ఆ అవ్వ.
రాజకీయ పార్టీలను కాదని ఇండిపెండెంటుగా పోటీ చేసిన ఆయన్ని, నందికొండ (నాగార్జునసాగర్) ప్రాజెక్టు సాకారం కావడంలో ఆయన కృషిని గుర్తించి, అక్కడి ప్రజలు వరసగా అనేక పర్యాయాలు తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. తిరిగి అదే వావిలాల వారిని 1972, 1978 లో జరిగిన ఎన్నికల్లో ఓడించారు. అంటే ఎన్నికల్లో డబ్బు ప్రభావం మొదలయిందన్న మాట. ఆ తరువాత వావిలాల ఎన్నికల రాజకీయాలనుంచి శాస్వతంగా తప్పుకున్నారు.
http://www.teluguone.com/news/content/special-story-on-vavilala-gopalakrishnayya-39-98489.html





