రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Publish Date:Mar 26, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడింది. శనివారం(మార్చి 28) ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా తీర్మానం అమోదించనుంది. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా ఆమోదించిందని, అయితే పార్లమెంటులో బిల్లు పాస్ కావాల్సి ఉందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నందున, రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానాన్ని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ చట్టం పూర్తయితే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుందన్నారు. గవర్నర్ ఎ అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో శనివారం (మార్చి 28) ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది.
http://www.teluguone.com/news/content/special-assembly-session-to-grant-statutory-status-to-amaravati-as-capital-25-216195.html





