పోలీసులపై సోము దాష్టీకం.. నడి రోడ్డుపై వీరంగం
Publish Date:Jun 8, 2022
Advertisement
అమలాపురం బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఇంతకీ ఆయన అమలాపురం ఎందుకు బయలుదేరారంటే.. అమలాపురం అల్లర్లలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు. అయితే అమలాపురం లో ఆంక్షలు అమలులోన ఉన్నందున ఆయనను పట్టణంలోనికి అనుమతించేది లేదని పోలీసులు ఆయనను జొన్నాడ సమీపంలో అడ్డుకున్నారు. ఆయన మొండిగా ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో ఆయన వాహనానికి అడ్డంగా మరో వాహనాన్ని నిలిపారు. నిజానికి అమలాపురంలో ఇంకా ఆంక్షలు అమలులో ఉన్నాయి. దాదాపు పక్షం రోజుల తరువాత మంగళవారం నాడు పట్టణంలో అంతర్జాల సేవలను పునరుద్ధరించారు. బయట వారెవరికీ పట్టణంలోకి అనుమతి లేదన్న ఆంక్షలను ఇంకా తొలగించలేదు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు అమలాపురం పర్యటనకు అడ్డుకున్నారు. అంతే ఒక్కసారిగా సోము వీర్రాజు పోలీసులపై ఫైర్ అయిపోయారు. నచ్చచెప్పబోయిన పోలీసులపై దౌర్జన్యం చేశారు. ఫోను మాట్లాడుతున్న పోలీసుపై చేయి వేసి పక్కకు నెట్టేశారు. తన వాహనానికి పోలీసలు అడ్డంగా ఉంచిన వాహనం డ్రైవర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనను లారీ నుంచి కిందకు లాగేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపైకి కన్నెర్రచేసి వార్నింగ్ ఇచ్చారు. అల్లర్ల బాధితుల పరామర్శకు వెళుతున్న తనను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. సోము ఎంత వీరంగమాడినా పోలీసులు తమ మాటకే వినలేదు. చివరికి చేసేదేమి లేక తన అమలాపురం పర్యటనను రద్దు చేసుకుని సోము వీర్రాజు రావుల పాలెం నుంచి వెనుదిరిగారు.
http://www.teluguone.com/news/content/somuveeraju-angry-on-police-for-preventing-him-from-entering-amalapuram-39-137280.html





