ఒడిశా మోదీ.. నాణేనికి మరోవైపు చూస్తే దిమ్మతిరుగుతుంది
Publish Date:Jun 1, 2019
Advertisement
ఒడిషాకు చెందిన ప్రతాప్ చంద్ర సారంగి అనే 64 ఏళ్ల పెద్దాయన కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సారంగి నిరాడంబర జీవితం గడుపుతారని, ప్రజా సేవకే ఆయన జీవితం అంకితమని, అసలు ఆయన మంచితనం ముందు నేటి తరం రాజకీయ నాయకులు ఎవరు పనికి రారని.. ఇలా రకరకాలుగా ఆయన గొప్పతనం గురించి మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాం. అయితే నాణేనికి మరోవైపు అన్నట్టు.. సారంగిలో మరో కోణం ఉందట. ఆయన అందరూ అనుకుంటున్నంత మంచి వారేం కాదంటూ సోషల్ మీడియాలో మరో ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయట. మత కలహాలు రెచ్చగొట్టడం, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం లాంటి తీవ్రమైన నేరాలు ఆయనపై ఉన్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం మతబోధకుడు గ్రాహం స్టెయిన్స్ మరియు అతని ఇద్దరు కుమారుల్ని ఇంట్లో ఉంచి సజీవదహనం చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఒడిషా భజరంగ్ దళ్‌కు సారంగినే అధ్యక్షుడు. సజీవ దహనం కేసులో ఈయనపైనే ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేశారు. కానీ విచారణ మాత్రం తూతూ మంత్రంగా సాగుతూనే ఉంది. అంతే కాదు 2002లో మితవాద గ్రూపులు, బజరంగ్ దళ్‌తో కలిసి ఒడిషా అసెంబ్లీ మీద దాడి చేసిన కేసులో సారంగి అరెస్టయ్యారు. మొత్తానికి మీడియా పుణ్యమా అని నేటి గాంధీ అన్నంత పేరు తెచ్చుకున్న ఆయన.. ఒక్కొరోజులోనే ఆయన గురించి ఊహించని నిజాలు బయటకు రావడంతో.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలు సారంగి ఖండించారు. ఇవన్ని తప్పుడు కేసులని.. కావాలనే పోలీసులు తన మీద ఇలాంటి కేసులు పెట్టారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లంచం తీసుకునే పోలీసులకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను. దాంతో వారు నా మీద ఇలా తప్పుడు కేసులు పెట్టారు. ఇవన్ని తప్పుడు ఆరోపణలు అని కోర్టులే తేల్చాయి. చాలా కేసులను కొట్టేశాయి’ అని తెలిపారు.
http://www.teluguone.com/news/content/social-media-hero-pratap-sarangi-faces-serious-criminal-cases-39-87190.html





