స్మితా సభర్వాల్‌కి ఏమైంది?
Publish Date:Jul 21, 2024
Advertisement
కేసీఆర్ గవర్నమెంట్ వున్నప్పుడు అర్హతకు మించిన అందలాలు అందుకుని, సీఎం కార్యాలయంలో హవా నడిపించిన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కి ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యత లేదు. గతంలో మాదిరిగా ఆహా, ఓహో అంటూ భజన చేసేవారు లేరు. అందుకేమో ఉనికిని ప్రకటించుకోవడానికి అన్నట్టుగా స్మితా సభర్వాల్ మానసిక పరిస్థితి అదుపు తప్పిందన్నట్టుగా ‘ఎక్స్’ వేదికగా కామెంట్లు పోస్టు చేశారు. సివిల్ సర్వీసులలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని, వాటిని రద్దు చేయాలని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈమధ్య పూజా ఖేడ్కర్ అనే ఐఏఎస్ వివాదాస్పదంగా మారింది. ఆమె తప్పుడు దివ్యాంగ ధ్రువీకరణ పత్రంతో ఐఏఎస్ అయిందనే వాదన వినిపిస్తోంది. ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఏక సభ్య విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. దీని మీద కమిషన్ సభ్యుడు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్మితా సభర్వాల్ అసలు మొత్తానికే దివ్యాంగులకు రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ డిమాండ్ చేయడం సంచలనాన్ని సృష్టించింది. అదేవిధంగా యూపీఎస్సీకి ఛైర్మన్‌గా వున్న మనోజ్ సోనీ తనకు ఇంకా ఐదేళ్ళ సర్వీసు వుండగానే రాజీనామా చేశారు. ఈయన రాజీనామాకు, రెండేళ్ళ క్రితం తప్పుడు దివ్యాంగ సర్టిఫికెట్‌తో ఐఏఎస్ అయిన పూజా ఖేడ్కర్ అంశానికీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే, మనోజ్ సోనీ ఆరు నెలల క్రితమే యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల ఆయన రాజీనామాకి, పూజా ఖేడ్కర్ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ స్మితా సభర్వాల్ మనోజ్ సోనీ మీద కూడా కామెంట్లు పోస్టు చేశారు. మనోజ్ సోనీ రాజీనామా చేసి తప్పించుకుపోలేరని ఆమె కామెంట్ చేశారు. మనోజ్ సోనీ రాజీనామా చేయడం తప్పించుకు పోయినట్టు ఎందుకు అవుతుంది? పూజా ఖేడ్కర్ ఇష్యూతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మితా సభర్వాల్‌కి ఇంత చిన్న విషయం కూడా తెలియనట్టుగా మనోజ్ సోనీ మీద కామెంట్లు పెట్టారు. దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సింది స్మితా సభర్వాల్ కాదు.. తనకు సంబంధించని విషయం మీద, చాలా సున్నితమైన విషయం మీద అనవసరపు కామెంట్లు చేయడం ద్వారా స్మితా సభర్వాల్ కొత్త వివాదానికి తెరతీశారు. స్మిత చేసిన కామెంట్ల మీద భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్మిత సభర్వాల్ మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
http://www.teluguone.com/news/content/smita-sabharwal-comments-on-specially-abled-persons-25-181191.html





