ఇప్పుడు మేకపాటి.. అప్పుడు పునీత్.. ఇంచుమించు ఒకేలా!
Publish Date:Feb 21, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు జిమ్ కు వెళ్లేందుకు గౌతమ్ రెడ్డి రెడీ అయ్యారు. ఇంటిలో నుంచి బయటికి రాక ముందే ఛాతీలో నొప్పిగా ఉందని సోఫాలోనే ఆయన కూర్చున్నారట. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు, గన్ కలిసి చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్ రెడ్డిని బ్రతికించేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గౌతమ్ రెడ్డి (50) మరణించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. 1971 నవంబర్ 2వ తేదీన గౌతమ్ రెడ్డి జన్మించారు. 2022 ఫిబ్రవరి 21న ఆయన తుదిశ్వాస విడిచారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామాలు చాలా కఠినంగా చేసేవారు. జిమ్ కు వెళ్లేందుకు రెడీ అయిన ఆయనకు గుండెపోటు వచ్చింది. ఐదు పదుల వయస్సులోనే ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు. సరిగ్గా ఇలాగే విపరీతంగా కఠినమైన వ్యాయామాలు చేసే కన్నడ సినీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయస్సులో గుండెపోటుకు గురై గత ఏడాది అక్టోబర్ 29న మరణించారు. పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17న జన్మించారు. పునీత్ కూడా విపరీతంగా వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. ఇలా అటు పునీత్ రాజ్ కుమార్, ఇటు మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామానికి వెళ్లేందుకు రెడీ అయి గుండెపోటుకు గురికావడం కాకతాళీయం కావచ్చు. అలాగే అటు పునీత్, ఇటు గౌతమ్ రెడ్డి కూడా పోస్ట్ కోవిడ్ పరిణామాలతోనే మరణించడం యాదృచ్ఛికం కావచ్చు. ఇద్దరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి డోస్ లు వేసుకున్న వారే కావడం గమనార్హం. మేకపాటి గౌతమ్ రెడ్డి తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసత్వాన్ని కొనగిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో, 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడిచే దాకా ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అటు పునీత్ రాజ్ కుమార్ కూడా తన తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసత్వాన్నే కొనసాగించారు. ఆయన బాటలోనే పునీత్ సినిమా నటుడిగా ఎదిగారు. గౌతమ్ రెడ్డి- పునీత్ రాజ్ కుమార్ ఇద్దరూ కూడా మృదు స్వభావులే. ఇద్దరి తండ్రుల పేర్లలోనూ ‘రాజ’ (రాజ్ కుమార్, రాజమోహన్ రెడ్డి) కామన్ పాయింట్. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఏనాడూ కఠినంగా వ్యవహరించిన, ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవని చెబుతుంటారు. ఇద్దరూ అజాత శత్రువులే అంటారు. పునీత్ రాజ్ కుమార్ కు మన తెలుగు చిత్రపరిశ్రమలోని అనేక మందితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. అలాగే.. గౌతమ్ రెడ్డి కూడా మంచి స్వభావి అని, అందరితోనూ ఎంతో మర్యాదగా, కలుపుగోలుగా వ్యవహరించే వారని టీడీపీ నేతలు సైతం చెబుతుండడం విశేషం. పార్టీలకు అతీతంగా ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరించేవారని అంటారు. ఇద్దరూ కూడా ఐదు పదుల వయస్సుకు కాస్త అటూ ఇటూగానే మరణించడం బాధాకరం. తమ తమ రంగాల్లో మంచి ప్రతిభ కనబరడంతో పాటు, ముందు ముందు ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ రాజ్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం పట్ల ఇద్దరి అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.
http://www.teluguone.com/news/content/similarities-between-mekapati-goutham-reddy-and-puneet-rajkumar-deaths-25-132084.html





