చెవులపిల్లి కాదు చెవుల మేక..గిన్నిస్ రికార్డుల్లోకి సింబా
Publish Date:Jun 21, 2022
Advertisement
సింబా జాగ్రత్త శతృవులుంటారు. అలా చెప్పాపెట్టకుండా పరిగెట్టుకు వెళ్లకు. నీ స్నేహితులతో ఆడుకో.. అంటుంది తల్లి సివంగి తన బుజ్జి సింబాను ప్రేమగా మందలిస్తూ. ఇది ద లయన్ కింగ్ సినామాలో సీన్. సింబా.. నీ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కడం ఖాయం అంటున్నాడు దాని యజమాని మహమ్మద్ హసన్ నరెజొ! సినిమాలో సింబా ఆ తర్వాత పెరిగి పెద్దదయి అడవికి రాజవుతుంది. హసన్ గారి సింబా త్వరలో ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కుతోంది! ఆ సింబా సింహం అయితే ఈ సింబా మేకపిల్ల. మేకపిల్ల ఏమిటి.. గన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడమేమిటని అనుకుంటున్నారా.. తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే మరి. మేకల్ని పెంచుకునేవారుంటారు. మేకల మందను కుటుంబ సమానంగా చూసుకునేవారూ వుంటారు. కానీ ఈ సింబాని మాత్రం హసన్ ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నారు. సింబా అనేది నూబియాన్ అనే మేక జాతికి చెందిన మేక. దీనికి అసాధారణంగా పెద్ద పెద్ద చెవులున్నాయి. ఎంత పెద్దవి అంటే వాటి పొడవు 19 అంగుళాలు! ఆ పెద్ద చెవులే దీని ప్రత్యేకత! హసన్ నరెజో పాకిస్తాన్ కరాచీకి చెందిన వాడు. మొన్న జూన్ ఐదో తేదీన సింధ్‌లో ఈ సింబా పుట్టింది. దాని అతి పెద్ద చెవులు చూసి అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇప్పుడు మరీను. అది నడుస్తుంటే ఆ చెవులు మొహానికి రెండువైపులా నేలమీదకి జీరాడుతున్నాయి. సింబా మాత్రం ఎవరో తనని అడ్డుకుంటున్నారని భయంతో పరుగులెత్తుతోంది! అసలు నూబాన్ జాతి మేకలకే ఇలాంటి పెద్ద పెద్ద చెవులు వుంటాయిట. అయితే ఆ జాతి మేకలు చాలా అరుదుగా వుంటాయి. అది వుండటం హసన్ అదృష్టం అంటున్నారు అతని స్నేహితులు, చుట్టుపక్కలవారూ! కరాచీలో వాతావరణం ఇలాంటి జాతి వృద్ధికి అనుకూలిస్తుందని అంటున్నారు. వాతావరణంలో విపరీత మార్పులు వుంటాయి. వర్షాకాలం విపరీత వర్షాలు, ఎండాకాలం వేడిమి ఏకంగా 47 డిగ్రీలు చేరుకుంటుందిట! ఇంత ఎండా కాలంలోనూ ఈ జాతి మేకలకు ఆ పెద్ద పెద్ద చెవులే వేడిమి నుంచి రక్షణ కల్పిస్తాయి! మామూలుగా సింధ్ ప్రావెన్స్‌లో ఎక్కువుగా కామోరీ జాతి మేకలే వుంటాయి. ప్రపంచ దేశాల్లో అసలు మేకల ఉత్పత్తి పాకిస్తాన్‌లోనే ఎక్కువ. ఆ పరంగా పాకిస్తాన్ సుమారు 54 మిలియన్‌లతో మూడవ స్థానంలో వుంది. సరే, సింబా విషయానికి వస్తే, ఈ మేక అత్యంత అరుదయినది గనుక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కే అవకాశంఅవకాశం వుందని యావత్ కరాచీ ఆశతో ఉంది.
http://www.teluguone.com/news/content/simba-the-big-ears-goat-to-get-into-gunnis-book-of-world-records-25-138120.html





