రాహుల్ హామీలకు సిద్దూ బ్రేక్
Publish Date:May 22, 2023
Advertisement
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్దరామయ్యా మధ్య మరో మహా సంగ్రామం జరిగింది. ఆ మహా సంగ్రామంలో సిద్దరామయ్య విజయం సాధించారు. సీఎం రేసులో గెలిచిన ఆయన ముఖ్యమంత్రిగా, ఓడిన డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఇద్దరితో పాటుగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి కనీసం పాతిక మందితో ప్రమాస్వీకారం చేయించి, మొదటి రోజునుంచే హామీలఅమలకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశించారు. రాహుల్ ఆదేశాలను పార్టీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక నేతలకు చేరవేశారు.అయితే ఏ వర్గానికి ఎన్ని మంత్రి పదవులు అనే లెక్క తేలక పోవడం వల్లనో ఏమో ప్రస్తుతానికి ఎనిమిది మంది మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి కుర్చీకోసం నాలుగైదు రోజుల పాటు హోరాహోరీగా పోటీ పడిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ మంత్రి పదవుల విషయంలోనూ అదే స్పూర్తి కొనసాగిస్తున్నారు. కుర్చీలాట కారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వారం రోజులకు కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా పది మందితో పాక్షిక మంత్రి మండలి కొలువు తీరే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటు ఎప్పుడు జరుగ్తుంది అనే విషయంలో ప్రస్తుతానికి ఎవరికీ క్లారిటీ లేదు. మంత్రి పదవుల కోసం అంతర్గతంగా వస్తున్న ఒత్తిళ్ళకుతోడు కాంగ్రెస్ గెలుపునకు కొమ్ము కాసిన ముస్లిం మైనార్టీ వర్గాలు,అలాగే, ఇంకా అనేక ఇతర వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్ళ నేపథ్యంలో పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటుకు మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన తొలి మంత్రి వర్గ సమావేశం జరిగింది. అయితే ఐదు హామీల అమలకు మంత్రి మండలి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందే కానీ హమీల అమలుకు పచ్చ జెండా అయితే ఊపలేదు. ఐదు హమీల అమలుకు సంవత్సరానికి రూ 50,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. అయినా ఐదు హమీలను అమలు చేసి తీరతామని, వచ్చే మంత్రి మండలి సమావేశంలో విధివిధానాలు ప్రకటించి హామీల అమలుకు శ్రీకారం చుడతామని మీడియా సమావేశంలో చెప్పారు.అంటే ఒక విధంగా, రాహుల గాంధీ హామీలకు సిద్దరామయ్య బ్రేకులు వేశారు. ఫస్ట్ నుంచి నెక్స్ట్ కు పోస్ట్ పోన్ చేశారు. కాగా, ఈ ఐదు హామీలు ప్రజలను, ముఖ్యంగా మహిళలను గట్టిగ్గా ఆకట్టుకున్నాయని అందుకే కాంగ్రెస్ పార్టీ ఆశించిన దానికంటే అధిక మెజారిటీ సాధించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా మొదటి మంత్రి వర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని హామీలను వెంటనే అమలు చేస్తామని ఇచ్చిహామీని ప్రజలు ముఖ్యంగా మహిళలు నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేశారని అంటున్నారు. అయితే తొలి మంత్రి మండలి సమావేశంలో సూత్రప్రాయ ఆమోదంతో సరిపెట్టడంతో ప్రజల్లో అప్పుడే అనుమానాలు మొదలయ్యాయని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ఆర్థిక అవరోధాలు ఎన్ని ఎదురైనా, హామీలు అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. రూ.3.1 లక్షల కోట్ల బడ్జెట్ లో హామీల అమలుకు రూ.50,000 కేటాయించడం కష్టమేమీ కాదని, 13 మార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనుభవం ఉన్న సిద్దరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదు హామీలు అమలు చేసినా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోదు. ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి అసలే రాదని సిద్దరామయ్య పేర్కొనారు. రాష్ట్ర అప్పులపై ప్రతి సంవత్సరం రూ.56, 000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నప్పుడు, హమీల అమలుకు రూ. 50,000 కోట్లు ఇవ్వలేమా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అయితే, సిద్దరామయ్య చెప్పిన లెక్కల ఆధారంగా చూసినా రూ.3.1 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ. లక్ష కోట్లకు పైగా రాష్ట్ర అప్పులపై వడ్డీల చెల్లింపు, ఐదు హామీల అమలుకు ఖర్చుచేస్తే ఇక ఉద్యోగుల జీత భత్యాలు, విద్యా, వైద్యం, వంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కర్ణాటక మరో ఏపీలా అప్పుల కుప్పగా మారుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అదలా వుంటే... ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రిమండలి ప్రమాణ స్వీకార వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు గ్యారెంటీల ప్రస్తావన చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన ఒకటి రెండు గంటల్లో జరిగే మంత్రిమండలి తొలి సమావేశంలోనే ఆమోదముద్ర పడుతుందని స్పష్టమైన ప్రకటన చేశారు. ఒక విధంగా ఆ క్షణం నుంచే ఐదు హామీలు అమలు జరిగినట్లే అనుకోవచ్చనే రీతిలో భరోసా కల్పించారు.
http://www.teluguone.com/news/content/siddu-break-to-rahul-promises-25-155751.html





