శిద్దా ఫ్యామిలీ పొలిటికల్ గా ఇక తెరమరుగేనా?
Publish Date:Jul 3, 2025
Advertisement
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు. దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి ఏడాదిగా ఏ పార్టీలో చేరలేకపోతున్నారు. దాంతో ఆయనతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేత గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధా రాఘవరావు రాజకీయ జీవితం డైలమాలో పడటానికి కారణం స్వయంకృతాపరాధమే అంటున్నారు. వ్యాపార వేత్తగా ఉన్న సిద్ధా రాఘవరావు 1999లో తెలుగుదేశంలో చేరగానే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అయితే ఎన్నికల్లో శిద్దా పరాజయం పాలయ్యారు. అయినా శిద్దా రాఘవరావును శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా నియమించి చంద్రాబాబు సముచిత గౌరవం ఇచ్చారు. అనంతరం 2007లో ఎమ్మెల్సీగాను అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అక్కడ విజయం సాధించిన రాఘవరావుకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలు కేటాయించారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు సైకిల్ దిగి ప్యాన్ గూటికి చేరారు. అయితే వైసీపీలో చేరిన శిద్దాకు అక్కడ కనీస ప్రాధాన్యత కూడా లభించలేదు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అంతా తానై శాసించిన రాఘవరావుకు వైసీపీ లో ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా.. 2024 ఎన్నికల్లో ఎక్కడా సీటు కూడా కేటాయించలేదు. ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన శిద్ధా రాఘవరావు గడిసిన సంవత్సర కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండి పోయారు. అయితే ఆయన అనుచరగణం మాత్రం ఆయన టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారంట. మరో వర్గం మాత్రం కష్టకాలంలో పార్టీ వీడి పోయిన వారిని ఎవరినీ పార్టీలో చేర్చుకోవద్దని లోకేష్ చెప్పారని.. శిద్దా రాఘవరావు ను టీడీపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. జిల్లాలో మాత్రం టీడీపీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన శిద్దా వైసీపీకి వెళ్ళి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్నారన్న టాక్ నడుస్తోంది. రాఘవరావుతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకం అయ్యిందట. శిద్దా రాఘవరావు తన కుమారుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు బాగానే ప్రయత్నాలు చేశారంట. టీడీపీలో మంత్రిగా శిద్దా కొనసాగుతున్న సమయంలో ఆయన పోటీచేసి విజయం సాధించిన దర్శి నియోజకవర్గంలో సిద్ధా సుధీర్ పెత్తనమే కొనసాగింది. 2019 ఎన్నికల్లో తాను ఒంగోలు ఎంపీగా పోటీచేస్తూ తన కుమారుడికి దర్శి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారట. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల తర్వాత వ్యాపార వ్యవహారాల్లో వైసీపీ ప్రభుత్వం కల్పించిన చిక్కుల నుండి బయట పడేందుకు శిద్దా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత వైసీపీకి రిజైన్ చేసి, టీడీపీలో చేరే అవకాశం లేకుండా పోయిన ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో ఆయనతో పాటు సిద్దా సుధీర్ రాజకీయ భవిష్యత్ కూడా డోలాయమానంలో పడింది. 2014 నుండి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న శిద్దా కుటుంబం ఇప్పుడు ఇంటికే పరిమితం కావటంతో సుధీర్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 2024 ఎన్నికల ముందు కూడా రాఘవరావుకు తెలుగుదేశంలో చేరే అవకాశం వచ్చిందట. అయితే అప్పట్లో ఆయన అప్పట్లో ససేమిరా అన్నారంట. చేజేతులా చేసుకున్న దానికి ఇప్పుడు అనుభవి స్తున్నారని టీడీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయి.
మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఫొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశంలో కీలక నేతగా పలు పదవులను అలంకరించిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియకుండా తయారయ్యారు. గడిచిన సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సి అనివార్య పరిస్థితిలో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/sidda-raghavarao-political-carear-close-39-201164.html





