వన్డే పగ్గాలూ శుభమన్ గిల్ కే?
Publish Date:Jul 11, 2025

Advertisement
టీమ్ ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జట్లుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పుడు మూడో టెస్టు జరుగుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంది. తొలి టెస్టులో అద్భుతంగా ఆడినా చివరికి ఓటమి తప్పలేదు. అయితే రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకుని ఎడ్జ్ బాస్టన్ వేదికపై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ తోనే టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న శుభమన్ గిల్ బ్యాటర్ గా అద్భుతంగా రాణించడమే కాకుండా, స్కిప్పర్ గా కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వన్డే సారథ్య బాధ్యతలు కూడా శుభమన్ గిల్ కే అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా టెస్టు, టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డేలలో మాత్రం కొనసాగుతున్నాడు. వచ్చే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని ప్రకటించాడు. దీనిపై బీసీసీఐ రోహిత్ శర్మను 2027 వరల్డ్ కప్ వరకూ వన్డేల్లో క్రీడాకారుడిగా కొనసాగిస్తూనే.. సారథ్య బాధ్యతలు మాత్రం యువ ఆటగాడు, టెస్ట్ కెప్టెన్ గా సత్తా చాటుతున్న శుభమన్ గిల్ కు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా శుభమన్ గిల్‌కు త్వరలో జరిగే శ్రీలంక వన్డే సిరీస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారని అంటున్నారు.
టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని ఆలోచించడం ఏంటన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. . రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియా గెలుచుకుంది. టెస్టుల్లోనూ పలు విజయాలను అందుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే రోహిత్ ను వన్డే కెప్టెన్ గా తొలగించడంపై పునరాలోచించాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. అయితే రోహిత్‌ను సీనియర్ ఆటగాడిగా కొనసాగించి.. కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం గిల్‌కు అప్పగించాలని నిర్ణయానికి వచ్చేసిన సెలక్షన్ కమిటీ ఈ విషయంపై ఇప్పటికే రోహిత్ తో చర్చించారనీ, రోహిత్ కూడా అంగీకరించాడనీ అంటున్నారు. వన్డే కెప్టెన్సీ మార్పుపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.
http://www.teluguone.com/news/content/shubhman-gil-to-replace-rohit-sharma-as-one-day-captain-25-201751.html












