జైలు నుంచి ఆస్పత్రికి ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సుప్రీం తీర్పు.!
Publish Date:Aug 19, 2026
Advertisement
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే జైలు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆ దేశ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత కొంతకాలంగా జైలులో ఉంటూ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న . ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, ఆయనకు సరైన వైద్య సహాయం అందడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన పాకిస్థాన్ సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి 48 గంటల్లోగా తరలించాల్సి ఉంటుంది. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా సుప్రీం కోర్టు తన తీర్పులో విస్పష్టంగా పేర్కొంది. ఈ మెడికల్ బోర్డులో కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, నేత్ర వైద్య నిపుణులతో పాటు ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడిని కూడా భాగస్వామిగా చేర్చాలని సుప్రీం కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసిన కోర్టు అంత వరకూ ఆయనను ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మరియు ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ షాహిద్ వహీద్ స్పష్టం చేశారు. ఖైదీగా ఉన్న వ్యక్తి ఆరోగ్య భద్రతను నిర్ధారించేందుకే ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆయనను కలిసేందుకు అనుమతించాలని ఆదేశించిన కోర్టు.. బ్రిటన్‌లో ఉన్న ఆయన కుమారులతో ఫోన్లో సంభాషించేందుకూ అనుమతించి, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించింది. గత కొద్ది నెలలుగా ఇమ్రాన్ ఖాన్ కుడికంటి చూపు తీవ్రంగా మందగించిందనే కథనాలు తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ఆయన కుడికంటిలో రక్తం గడ్డకట్టడం వల్ల దాదాపు 85 శాతం చూపు తగ్గిందని ఆయన కుటుంబ సభ్యులు, పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, అడియాలా జైలు అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో ఇమ్రాన్ ఖాన్‌కు నిపుణులైన వైద్యులతో తరచూ పరీక్షలు చేయిస్తున్నామని, ప్రస్తుతం ఆయన కంటిచూపు మెరుగుపడి సాధారణ స్థితికి వచ్చిందని పేర్కొన్నారు. అయితే జైలు నివేదికలపై పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ప్రైవేట్ ఆస్పత్రి తరలింపుకే మొగ్గుచూపింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలపై ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల పీటీఐ పార్టీ నాయకులు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఆస్పత్రి వద్ద ఎలాంటి నిరసనలు లేదా ఊరేగింపులు నిర్వహించవద్దని, ఇమ్రాన్ ఖాన్ కోలుకోవడానికి ప్రశాంత వాతావరణం అవసరమని పీటీఐ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం మెడికల్ నివేదికలను వాడుకోకూడదని కోర్టు ముందే స్పష్టం చేసింది. Shift Imran Khan to Hospital, Pakistan Supreme Court, Imran Khan Health Condition, Pakistan Tehreek e Insaf, Adiala Jail
http://www.teluguone.com/news/content/shift-imran-khan-to-hospital-36-229249.html





