జగన్ వి రాజకీయ ద్వంద్వ ప్రమాణాలు.. నిప్పులు చెరిగిన షర్మిల
Publish Date:Aug 15, 2025
Advertisement
వైసీపీ భయపడినంతా అయ్యింది. వైసీసీ అధినేత జగన్ కు స్వయానా సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల జగన్ పై నిప్పులు చెరిగారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో అన్యాయం జరిగిందంటూ ఆక్రోశం వ్యక్తం చేసిన జగన్.. ఆ సందర్బంగా రాహుల్ గాంధీపై కూడా విమర్శలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాహుల్ గాంధీ హాట్ లైన్ లో టచ్ లో ఉంటారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా ఖండించింది. జగన్ పై విమర్శలు గుప్పించంది. అయితే వైసీపీ మాత్రం జగన్ అనవసరంగా రాహుల్ పై వ్యాఖ్యలు చేసి షర్మిలను రెచ్చగొట్టారనీ అంతర్గత సంభాషణల్లో పేర్కొన్నారు. ఆమె రియాక్షన్ ను పార్టీ, జగన్ తట్టుకోవడం కష్టమని బెంబేలెత్తి పోయారు. కొందరు వైసీపీయులైతే బాహాటంగానే జగన్ రాహుల్ హాట్ లైన్ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్న తమ అభిప్రాయాన్ని బాహాటంగానే చెప్పేశారు. షర్మిల ఎలాంటి విమర్శల బాంబులు పేలుస్తుందోన్న ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా వైసీపీ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో పార్టీ ప్రతిష్టే కాకుండా జగన్ ప్రతిష్ఠ కూడా దిగజారిందనీ, ఇక షర్మిల విమర్శలకు మొదలు పెడితే జగన్ ప్రతిష్ఠ పాతాళానికి దిగజారడం ఖాయమనీ భయపడ్డారు. వారి భయమే ఇప్పుడు నిజమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై జగన్ చేసిన విమర్శలకు షర్మల ఘాటుగా స్పందించారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాలలో ద్వంద్వ ప్రమాణాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. రాహుల్ గాంధీకి బలప్రదర్శన వ్యూహాలు తెలియవనీ, వాహనాల కింద జనాలను నలిపేయడం రాదనీ షర్మిల జగన్ వై విమర్శనాస్త్రాలు కురిపించారు. జగన్ హాట్ లైన్ గురించి మాట్లాడటం వింతగా ఉందన్న షర్మిల . చంద్రబాబు, రాహుల్ గాంధీ కాదనీ, జగనే నిత్యం మోడీ, అమిత్ షాలప్రాపకం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. పార్టీ సభ్యుల తప్పులకు ఇతరులను నిందించడం జగన్ నైజం అన్న షర్మిల జగన్ నాయకత్వాన్ని, విలువలను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారనీ, జగన్ కు అసలు ప్రజాస్వామ్యం అంటేనో పొసగదనీ విమర్శించారు.
http://www.teluguone.com/news/content/sharmila-fires-jagan-39-204273.html





