లిక్కర్ స్కాంలో జగన్‌ని వదలొద్దంటున్న షర్మిల
Publish Date:Jul 24, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను వదిలిపెట్టొద్దని ఆయన చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల కోరారు. విజయవాడలో విలేకర్లతో మాట్లాడిన ఆమె.. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్‌పై విమర్శలు గుప్పించారు. డిస్టలరీల వద్ద కమీషన్‌లు, బినామీలు, నగదు రవాణా అంశాలతోపాటు వైఎస్ జగన్‌కి నెలకు రూ. 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు. దీంతో ఈ మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివర విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో సైతం కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరిపారని చెప్పారు. కేవలం బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్లను నిలిపి వేశారని ఆమె ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాటి ప్రభుత్వం చేసిన ఆర్ధిక నేరంగా ఈ మద్యం విక్రయాలను ఆమె అభివర్ణించారు. రూ. 3, 500 కోట్లు మద్యం కుంభకోణం ఒక్కటే కాదు.. పన్నులు ఎగ్గొట్టాలనే క్యాష్ పరంగా ఈ విక్రయాలు జరిపారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా విచారణ జరగాలని ఆమె పేర్కొన్నారు. చివరకు నాన్ డ్యూటీ పేమెంట్లు మొత్తం బ్లాక్‌లోనే జరిగాయన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారో తేల్చాలన్నారు. డిజిటల్ పేమెంట్ ఆపడం వెనుకే అవినీతి ఉందన్నారు. వీటన్నింటికీ జగన్ సమాధానం చెప్పాలన్నారు. రిషి కొండను ఎందుకు తవ్వారో కూడా ఇంత వరకు వైఎస్ జగన్ సమాధానం చెప్పలేదన్నారు. వివేకా హత్యలో జగన్ సొంత మీడియా హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పిందో తెలియలేదన్నారు. జగన్ అసలు అంశాలను మరుగున పెట్టి.. మభ్యపెట్టి మాట్లాడటంలో దిట్ట అంటూ వైఎస్ షర్మిల మరోసారి తన అన్నను తీవ్రస్థాయలో టార్గెట్ చేశారు.
సిట్ పద్దతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు.
http://www.teluguone.com/news/content/sharmila-demand-not-to-leave-jagan-in-liquoe-25-202664.html





