మైనింగ్ మాఫియా డాన్ గాలికి ఏడేళ్ల జైలు
Publish Date:May 6, 2025
Advertisement
ఎట్టకేలకు మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్థనరెడ్డి పాపం పండింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం ( మే 6) తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం దాదాపు 15ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురికి ఏడుళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అనంతపురం జిల్లా ఓబులాపురంలో అక్రమ మైనింగ్‌తో రూ.వేల కోట్లు సంపాదించి ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరిన గాలి జనార్దన్‌రెడ్డికి చివరకు ఇదే ఓబులాపురం మైనింగ్ కేసులో ఉచ్చు బిగుసుకుంది. ఓబులాపురంలో సాగించిన అక్రమాలు నిజమేనని సీబీఐ కోర్టు తేల్చింది. ఈ కేసులో ఏ1 బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్దన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్, ఏ4 ఓఎంసీ కంపెనీ, ఏ7 కె.మెఫజ్ అలీఖాన్‌లను దోఖషులుగా తేల్చి కోర్టు.. ఏ8 కృపానందం, ఏ9 సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది. ఓఎంసీ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. ఏ6గా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని 2022లో కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జి చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కుంభకోణాల్లో ఓబులాపురం మైనింగ్ కుంభకోణం ఒకటి. ఓబులాపురం మైనింగ్ కుంభకోణం కర్ణాటక – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇనుప ఖనిజ తవ్వకాలలో జరిగిన అక్రమాలకు సంబంధించింది. ఈ స్కామ్ ప్రధానంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీతో ముడిపడి ఉంది. దీనిని రెడ్డి సోదరులు.. గాలి జనార్థన రెడ్డి, గాలి కరుణాకర రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి నడిపించి మైనింగ్ డాన్లుగా ప్రసిద్ధి చెందారు. వీరు కర్ణాటక ప్రభుత్వంలో మంత్రులుగా కూడా పనిచేశారు. ఈ కుంభకోణంలో బళ్లారి , అనంతపురం ప్రాంతాలలో అక్రమ ఖనిజ తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ.. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అటవీ భూములలో అనుమతి లేకుండా ఇనుప ఖనిజాన్ని తవ్వినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతించిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి 29.30 లక్షల టన్నుల ఇనుము ఖనిజాన్ని ఓఎంసీ సంస్థ అక్రమంగా తవ్వినట్లు సీబీఐ ఆరోపించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ.. 2007-2010 మధ్య దాదాపు 60 లక్షల టన్నుల ఇనుము ఖనిజం అక్రమంగా తవ్విందని సీబీఐ అభియోగాలు మోపింది. దీని విలువ దాదాపు రూ. 42,000 కోట్లు ఉంటుందని చార్జిషీట్ లో పేర్కొంది. కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే 2011లో సమర్పించిన నివేదిక ప్రకారం.. ఖనిజ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. జీరో రిస్క్ సిస్టమ్అనే రక్షణ, దోపిడీ వ్యవస్థను సృష్టించి గాలి జనార్థన రెడ్డి ఈ కుంభకోణానికి తెరలేపినట్లు పేర్కొంది. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అనుబంధంగా ఉన్న జీఎల్ఏ ట్రేడింగ్ జీజేఆర్ హోల్డింగ్స్ వంటి గాలి జనార్థన్ రెడ్డి సోదరుల సంస్థలు.. అక్రమ తవ్వకాల ద్వారా వచ్చిన సొమ్మును విదేశీ కంపెనీలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎగవేయడంతో పాటు ఆదాయాన్ని దాచిపెట్టి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గాలి జనార్థన్ రెడ్డి సోదరులపై అభియోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సిఫార్సు మేరకు 2009లో సీబీఐ ఈ కుంభకోణంపై విచారణ ప్రారంభించింది. రెండేళ్ల విచారణ అనంతరం 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్థన రెడ్డి, అతని బావ బీ.వీ. శ్రీనివాస రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అలాగే ఈ కుంభకోణం కేసులోమాజీ ఐఏఎస్ అధికారి వీ.డీ. రాజగోపాల్, ఏపీ ఇండస్ట్రీస్ మాజీ కార్యదర్శి వై. శ్రీలక్ష్మిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఓబులాపురం కంపెనీకి ప్రాధాన్యత ఇచ్చి ఇతర దరఖాస్తుదారులకు లైసెన్సులు నిరాకరించినట్లు రాజగోపాల్ , శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. ఓబులాపురం మైనింగ్ కుంభకోణానికి సంబంధించి 2015లో జనార్థన రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించడంతో గత నెలలో వాదనలు పూర్తయ్యాయి.
http://www.teluguone.com/news/content/seven-years-jail-to-mining-mafia-don-galijanadhan-reddy-39-197575.html





