రాహుల్ కు వంత పాడిన శశిథరూర్.. కమలంతో కటీఫేనా?
Publish Date:Aug 8, 2025
Advertisement
ఇటీవలి కాలంలో.. మరీ ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నుంచి కాంగ్రెస్ కు ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతున్నట్లు కనిపించిన ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆశ్చర్యకరంగా యూటర్న్ తీసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ విమర్శలకు వంత పాడారు. రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలూ, వ్యక్తం చేసిన సందేహాలూ చాలా చాలా విలువైనవనీ, వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందేననీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అసలు గత కొంత కాలంగా శిశిథరూర్ కాంగ్రెస్ కు దూరం జరుగుతున్నట్లు కనిపిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఆయనను దూరం పెడుతూనే వస్తోంది. మోడీపై ప్రశంసలు గుప్పిస్తూ.. తాను కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న సంకేతాలను పలు సందర్భాలలో శశిథరూర్ ఇచ్చారు. అన్నిటికీ మించి ఆపరేషన్ సిందూర్ కు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు విదేశాలకు వెళ్లిన బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక భూమిక పోషించారు. ఆయన పేరుకే కాంగ్రెస్.. కానీ మనిషి, మనసు మొత్తం బీజేపీయే అని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు. శశిథరూర్ తీరు, వ్యవహార శైలీ కూడా కమలం కండువా కప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా కనిపించింది. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరిగే చర్చల్లో కాంగ్రెస్ శశిథరూర్ కు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకపోవడానికి కారణం.. ఆయన పార్టీ విధానానికి అనుగుణంగా బీజేపీ తీరును ఎండగడుతూ ప్రసింగించాలన్న కాంగెస్ హైకమాండ్ సూచనకు అంగీకరించలేదనీ, తాను పార్టీలకు కాకుండా, భారత్ ప్రయోజనాలకు అనుగుణంగానే మాట్లాడతానని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ఇందుకే పార్లమెంటులో సిందూర్ పై చర్చలో శశిథరూర్ కు కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు. అటువంటి శశిథరూర్ ఇప్పుడు రాహుల్ కు మద్దతుగా గళమెత్తడం రాజకీయంగా ప్రాథాన్యత సంతరించుకుంది. బీజేపీతో సయోధ్య కోసం శశిథరూర్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయా అన్న చర్చకు తెరలేచింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ప్రజలను, ప్రజా తీర్పును మోసం చేశాయంటే కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను శశిథరూర్ బలంగా సమర్ధించారు. ఈ మేరకు శశి థరూర్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్టు రాజకీయంగా అత్యంత ప్రాథాన్యత సంతరించుకుంది. రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలు చాలా తీవ్రమైనవని శశిథరూర్ ఆ పోస్టులో పేర్కొన్నారు. పార్టీలు, ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా వీటిని పరిష్క రించి తీరాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యం చాలా విలువైనదనీ, దాని విశ్వస నీయతను అసమర్థత, నిర్లక్ష్యం ద్వారా నాశనం కానివ్వకూడదని ఈసీపై విమర్శలు గుప్పిం చారు. రాహుల్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఆయన ఈసీని డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/sesi-tharoor-support-rahul-39-203791.html





