మాకొద్దు దొరా.. తెలంగాణ సీఎస్ పదవిపై వెనకడుగు వేస్తున్న ఐఏఎస్ అధికారులు
Publish Date:Dec 18, 2019
Advertisement
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి ఈ నెల ( డిసెంబర్ ) 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇప్పట్నుంచే అధికారుల గురించి సర్కారు పెద్దలు ఆరా తీయడం ఆ పదవి గురించి ఐఏఎస్ లు చర్చించుకోవడం సహజంగానే జరుగుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం సీఎం కేసీఆర్ 14 మంది పేర్లను పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే వారిలో చాలా మంది అయిష్టం గానే ఉన్నట్టు తెలిసింది. గతంలో ఈ పోస్టు కోసం రెండు మూడు నెలలకు ముందే సీనియర్ ఐఏఎస్ అధికారులు క్యూ కట్టేవారు. తమ సీనియారిటీ ధ్రువపత్రాలని ప్రభుత్వానికి సమర్పించేవారు. తమకే అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసే వారు. ఎవరికి వారు తమ తమ స్థాయిలో ప్రయత్నాలు చేసేవారు. సీనియార్టీ ప్రకారం సీఎస్ పోస్టు దక్కకుంటే ట్రిబ్యునళ్లను సైతం ఆశ్రయించి దాని సాధించే అంత పోటీ ఉండేది. అయితే ఇప్పుడు అంతగా ఎవరూ ఆసక్తి చూపడం లేదని చెపుతున్నారు. అనేక సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పుడు సిఎస్ పదవి ఎందుకని కొందరు ఐఎఎస్ లు అనుకుంటున్నారు. సిఎస్ కు ఉన్న అధికారాల విషయంలోను ప్రభుత్వం బ్రేక్ వేయడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. సిఎస్ పరిధిలో ఉన్న అధికారాల అంశాల్లో కూడా సీఎంఓ జోక్యం చేసుకుంటోందనే భావన ఉంది. సచివాలయం లేకపోవటం అరాకొర వసతులు ఉన్న బిఆర్ కె భవన్ కు వెళ్లడానికి అయిష్టత లాంటి కారణాల వల్ల కూడా అనాసక్తితో ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆయా శాఖల సమీక్షలు సమావేశాలకు కూడా ముఖ్యమంత్రి సీఎస్ ను ఆహ్వనించకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎస్ కు ఉన్న అధికారాలని ప్రశ్నార్థకం చేస్తున్న తరుణంలో ఆ పోస్టు తీసుకోవడం ఎందుకు ఆ తరువాత ఆపసోపాలు పడటం ఎందుకని ఐఏఎస్ లు లైట్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/senior-ias-officers-not-interested-in-telangana-cs-post-39-92324.html





