పయ్యావుల కేశవ్ భద్రత తొలగింపు
Publish Date:Jul 11, 2022
Advertisement
జగన్ సర్కార్ ఒకరి తరువాత ఒకరిగా తెలుగుదేశం నాయకులను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సహించేది లే.. అన్నట్లుగా జగన్ సర్కార్ తీరు ఉందనడానికి మరో తాజా ఉదాహరణే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రజాపద్దుల సంఘం చైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రత తొలగింపు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పయ్యావుల కేశవ్ కు ఇప్పటి వరకూ వన్ ప్లస్ వన్ భద్రత ఉంది. అయితే సోమవారం పయ్యావుల కేశవ్ గన్ మన్ లను వెనక్కు పిలిపించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకే పయ్యావుల సెక్యూరిటీని తొలగించిందని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి కొద్ది రోజుల కిందటే పయ్యావుల కేశవ్ తనకు భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆలా కోరిన పయ్యావుల కేశవ్ కు భద్రత పెంచకపోగా... ఉన్న సెక్యూరిటీని తొలగించడంపై తెలుగుదేవం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తెలుగు దేశం నాయకులను భౌతికంగా, మానసికంగా వేధించడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. తక్షణం పయ్యావులకు భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాగా తెలుగుదేశం ఆరోపణలను ప్రభుత్వం కొట్టి పారేసింది. నిబంధనల మేరకు ప్రతి మూడేళ్ల కోసారి ప్రజాప్రతినిథుల వ్యక్తిగత భద్రతా సిబ్బందిని బదలీ చేయడం సహజమని, అందులో భాగంగానే పయ్యావుల భద్రతా సిబ్బంది బదలీ జరిగిందనీ వివరించింది. త్వరలోనే ఆయనకు భద్రతా సిబ్బందిని నియమిస్తామని వివరణ ఇచ్చింది. అయితే తెలుగుదేశం మాత్రం భద్రతా సిబ్బందిని బదలీ చేస్తే.. వారు రిలీవ్ అయ్యే సమయానికే కొత్త సిబ్బందిని నియమించాలి కదా అని నిలదీస్తున్నారు.
http://www.teluguone.com/news/content/security-withdrawn-to-payyavula-keshav-39-139473.html





